ట్రిపుల్ తలాక్ రద్దుకు ఆర్డినెన్స్

మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులివ్వడం ఇకపై శిక్షార్హం కానున్నది. ఈ మేరకు కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటీవలి వర్షాకాల సమావేశాల్లో.. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017 పేరిట ప్రవేశపెట్టిన బిల్లు రాజ్యసభ ఆమోదం పొందలేకపోవడంతో చట్టంగా మారలేదు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. దీనికి రాష్ట్రపతి వెంటనే ఆమోదముద్ర వేశారు. దీంతో ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత లభించడంతోపాటు వెనువెంటనే అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం మూడుసార్లు తలాక్ (తలాక్-ఏ-బిద్దత్) చెప్పి భార్యకు విడాకులివ్వడాన్ని నేరంగా పరిగణిస్తారు. అందుకు మూడేండ్ల జైలుశిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. తక్షణ ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాల్చేందుకు పార్లమెంట్‌లో తీవ్రంగా ప్రయత్నించామని, మరో మార్గంతరం లేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ తీసుకురాక తప్పడం లేదని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు.
ముస్లిం సామాజికవర్గంలో మూడుసార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇచ్చే సంప్రదాయంపై కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్నది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్రం చట్టం తీసుకురావాలని సూచించింది. ఈ మేరకు కేంద్రం ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు-2017 తీసుకురాగా, అది గత ఏడాది డిసెంబర్ 28న లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యాబలం లేని కారణంగా అక్కడ బిల్లు ఆమోదం పొందలేకపోయింది. ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల సమయంలో బిల్లు ఆమోదం పొందేలా చేయాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, సాధ్యపడ లేదు. మరోవైపు ఈ బిల్లుకు సవరణలు చేయాలని కాంగ్రెస్ తప్ప ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో కేంద్రం మూడు కీలక సవరణలను చేసింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో వర్షాకాల సమావేశాల్లోనూ బిల్లు పొందలేదు. బిల్లు చట్టరూపం దాల్చడంలో ఆలస్యమవుండటంతో ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ తీసుకురాగా, కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది. కాగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవ డాన్ని స్వాగతిస్తున్నట్లు ట్రిపుల్ తలాక్ కేసులోని ఐదుగురు పిటిషనర్లలో ఒకరైన ఇష్రత్ జహాన్ అభిప్రాయపడ్డారు.

ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన జేడీ(యూ)
ట్రిపుల్ తలాక్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జనతాదళ్ (యునైటెడ్) వ్యతిరే కించింది. చర్చల ద్వారా అంగీకారం సాధించాలే తప్ప ట్రిపుల్ తలాక్ వంటి సున్నితమైన అంశాల్లో ఆర్డినెన్స్‌లు సరికాదు. మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలా ఉండే చట్ట సవరణలను జేడీ(యూ) బలంగా వ్యతిరేకిస్తున్నది అని పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ త్యాగి స్పష్టంచేశారు.
TAGS:Triple Talaq, Amit Shah, Asaduddin, Ravi Shankar Prasad

Related posts

Leave a Comment