ట్రాఫిక్‌ ఆగింది..మెట్రో నిండింది లక్షకు చేరిన ప్రయాణికులు

ఒక వాహనం రహదారి మధ్యలో ఆగితే కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరి ఎక్కడికక్కడ రోడ్లు నిండిపోతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో సమయం వృథా అవుతుండటంతో నగరవాసులు సమీప మెట్రో స్టేషన్‌ నుంచి గమ్యస్థానం చేరుకుంటున్నారు. ఇదివరకంటే ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు బస్సు దిగి లేదా వాహనాన్ని స్టేషన్‌లో నిలిపి మెట్రోలో వెళ్లిపోతున్నారు. గురువారం ఎర్రగడ్డలో ట్రాఫిక్‌ జాం దెబ్బకు మెట్రో ప్రయాణికుల సంఖ్య లక్ష దాటింది.
జాతీయ రహదారిపై ఎర్రగడ్డ వద్ద పాఠశాల బస్సు మొరాయించడంతో దారి ఇరుకిరుకుగా మారింది. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఎర్రగడ్డ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌, మరోవైపు మూసాపేట వరకు రెండువైపుల దారిపై ఈ ప్రభావం పడింది. దాదాపు నాలుగు గంటల పాటూ ఇదే పరిస్థితి. దీంతో చేసేది లేక బస్సుల్లోని ప్రయాణికులు దిగి దగ్గరిలోని వారు నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. దూర ప్రాంతాలకు వెళ్లేవారు సమీప మెట్రో స్టేషన్‌ నుంచి గమ్యస్థానం చేరుకున్నారు. దీంతో గురువారం 16వ తేదీ ప్రయాణికుల సంఖ్య లక్ష మార్కును దాటింది. 1.07 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. పాసులున్న ఉద్యోగులను మినహాయిస్తే 98,113 మంది టికెట్‌ కొని ప్రయాణించారు. వీరిలో 40,104 మంది మెట్రో కార్డు మీద ప్రయాణిస్తే.. టోకెన్లు తీసుకుని ప్రయాణించినవారు 58,009 మంది ఉన్నారు. గురువారం 9వ తేదీ మొత్తం ప్రయాణికులు 92,204 మందితో పోలిస్తే దాదాపు 10 శాతం ప్రయాణికులు పెరిగారు.

ట్రాఫిక్‌ ఆగిన సమీప స్టేషన్లలో.. ఎర్రగడ్డ నుంచి ఎస్సార్‌నగర్‌ వరకు, అటువైపు బాలానగర్‌ చౌరస్తా వరకు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ఈ మార్గంలోనే మెట్రో స్టేషన్లను ప్రయాణికులు ఆశ్రయించారు. ట్రాఫిక్‌ జాం సమాచారంతో ముందుగానే అప్రమత్తమై మెట్రోలో వెళ్లారు.

ఇదే అధికం: ఎన్వీఎస్‌రెడ్డి, మెట్రోరైలు ఎండీ
యాభై లక్షలకు పైగా వాహనాలు.. అదనంగా ఏడాదికి నాలుగు లక్షలు కొత్తవి వచ్చి నగరంలో చేరుతున్నాయి.. దీంతో రహదారులపై రోజురోజుకు ట్రాఫిక్‌ సమస్య పెరుగుతోంది. అదే సమయంలో తక్కువ సమయంలో గమ్యస్థానం చేరే సౌకర్యం మెరుగుపడటంతో మెట్రోలో ప్రయాణికులు రోజురోజుకు పెరుగుతున్నారు. గురువారం ప్రయాణికుల సంఖ్య 1.07 లక్షలకు చేరింది. ఎర్రగడ్డలో ట్రాఫిక్‌ జామ్‌లు కూడా ప్రయాణికులు పెరగడానికి ఒక కారణం.

Related posts

Leave a Comment