టీవీ చానళ్లను నిషేధిద్దాం.. దార్లోకి వస్తాయి!: టాలీవుడ్ హీరోల రహస్య భేటీలో ప్రతిపాదన

బాలకృష్ణ, పవన్ మినహా భేటీకి హాజరైన హీరోలు
చానళ్లకు కంటెంట్, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ప్రతిపాదన
ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన భేటీ
టాలీవుడ్‌లో ఇటీవల జరిగిన, జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్‌లో రహస్యంగా భేటీ అయిన టాలీవుడ్ హీరోలు, ఇతర సినీ ప్రముఖుల ముందుకు కీలక ప్రతిపాదన వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పవన్ కల్యాణ్, బాలకృష్ణ మినహా తెలుగు హీరోలందరూ దాదాపు హాజరయ్యారు.

సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. టీవీ చానళ్లను పూర్తిగా నిషేధించాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. టీవీ చానళ్లు మొత్తం సినిమాల మీదే ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి, పరిశ్రమ నుంచి వాటికి ఎటువంటి సహకారం అందకుంటే దార్లోకి వస్తాయని కొందరు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కంటెంట్, ఇంటర్వ్యూలు ఇవ్వడాన్ని నిలిపి వేయాలని, వాటిని అసలు ప్రోత్సహించవద్దని ప్రతిపాదించారు.

పరిశ్రమలో ఇకపై ఏ సమస్య వచ్చినా గ్రూపులుగా విడిపోకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. సినీ నటి శ్రీరెడ్డి వ్యవహారం బయటకు వచ్చినప్పుడే పిలిచి మాట్లాడి ఉంటే సమస్య ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదని కొందరు పేర్కొన్నారు.

సమావేశం మూడునాలుగు గంటలు జరిగినా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే అందరూ వెళ్లిపోవడం కొసమెరుపు. భేటీ వివరాలు వెల్లడించడానికి ఇష్టపడని సినీ ప్రముఖులు మళ్లీ రెండు మూడు రోజుల్లో మరోసారి ఈ విషయాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ నిర్ణయాన్ని కూడా ‘మా’ ద్వారానే వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నారు.

Related posts

Leave a Comment