టీడీపీ ఎమ్మెల్యేకి షాక్.. పార్టీకి రాజీనామా..?

chodavaram tdp mla ksns raju shocks to tdp
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ టీడీపీలో అసంతృప్త జ్వాల‌లు భ‌గ్గుమంటున్నాయి. అంతా ఒక్క‌టిగా ఉండి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపుకు కృషి చేయాల్సింది పోయి, అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో ప‌లువురు నేత‌లు పార్టీకి దూర‌మ‌వుతున్నారు. తెలుగుదేశం పార్టీకి అత్యంత కీల‌కంగా భావిస్తున్న విశాఖ జిల్లాలో కీల‌క నేత పార్టీకి రాజీనామా చేయ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

చోడ‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు తీరు న‌చ్చ‌క విసుగెత్తిపోయిన చోడ‌వ‌రం మేజ‌ర్ పంచాయ‌తీ మాజీ ఉప స‌ర్పంచ్ ఎంవీ సాగ‌ర్ టీడీపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్రక‌టించాడు. 1983 నుంచి 35 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకోస‌మే ప‌నిచేస్తున్న ఎం.వీ సాగ‌ర్ ఎమ్మెల్యే అనుస‌రిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా పార్టీని వీడుతున్న‌ట్లు తెలిపాడు.

పార్టీలో కార్య‌క‌ర్త‌గా మొద‌లుకుని అంచెలంచెలుగా ఎదిగిన సాగ‌ర్, పార్టీలో అనేక ప‌ద‌వులు నిర్వ‌హించాడు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌చేత ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు రూ.26 కోట్లు ఖ‌ర్చు పెట్టించార‌ని, త‌న కార‌ణంగానే చోడ‌వ‌రం మేజ‌ర్ పంచాయ‌తీలో ఎక్కువ సంఖ్య‌లో వార్డులు గెలుచుకున్నామ‌ని, తీరా ఉప స‌ర్పంచ్ గా ఎన్నికైన త‌ర్వాత ఎమ్మెల్యే త‌న‌ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశార‌ని, క‌నీసం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు కూడా ఆహ్వానించ‌ట్లేద‌ని, టీడీపీ బ‌లోపేతానికి కృషి చేస్తుంటే త‌న‌కు త‌గిన గుర్తింపు, ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా టీడీపీకి దూర‌మ‌య్యేలా చేశాడ‌ని సాగ‌ర్ నిప్పులు కురిపించాడు.

తాను తెలుగుదేశం పార్టీకి ఎంత‌గానే సేవ‌లందించాన‌ని, ఇవాళ పార్టీకి రాజీనామా చేయాల్సి వ‌స్తుంద‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని, దీనంత‌టికీ ఎమ్మెల్యేనే కార‌ణ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే వైఖ‌రి న‌చ్చ‌క అనేక‌మంది పార్టీకి రాజీనామా చేస్తున్నార‌ని, ఈ అంశాల‌న్నింటిపై సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాస్తాన‌ని తెలిపారు. త‌న‌ను ఆర్థికండా వాడుకుని వ‌దిలేశాడ‌ని, అయినా ఎప్పుడూ బాధ‌ప‌డ‌లేద‌ని, పార్టీతో త‌న‌కెలాంటి సంబంధం లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యాన‌ని చెప్పుకొచ్చాడు సాగ‌ర్. త‌న రాజీనామా పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎంతో ఆందోళ‌న క‌లిగిస్తోంద‌ని, వాళ్లంద‌రి అభిప్రాయం మేర‌కు ఏ పార్టీలో చేరాల‌న్న దానిపై తుది నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పాడు సాగ‌ర్.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపుకు ఎంత‌గానో కృషి చేసిన సాగ‌ర్ టీడీపీకి రాజీనిమా చేయ‌డం నిజంగా ఆ పార్టీకి కొంత న‌ష్టాన్ని మిగుల్చుతుంద‌ని అంటున్నారు పార్టీ ప్ర‌ముఖులు. ఆయ‌న వైసీపీ, జన‌సేన పార్టీల్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడ‌ని, అదే జ‌రిగితే చోడ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి కొంత మైన‌స్ అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు స్వంత పార్టీ నేత‌లు.

ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర విశాఖ జిల్లాకు చేరుకున్న స‌మ‌యంలో సాగ‌ర్ టీడీపీకి రాజీనామా చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. బ‌హుశా సాగ‌ర్ వైసీపీలో చేరేందుకు రాజీనామా చేసి ఉంటాడ‌ని ప‌లువురు భావిస్తున్నారు. ఆయ‌న అనుచ‌రులు కూడా వైసీపీలో చేరాల‌ని ఒత్తిడి చేస్తున్న‌ట్లు వినికిడి.
chodavaram ,tdp mla ,ksns ,raju shocks , tdp

Related posts

Leave a Comment