టీఎస్ ఎలక్షన్స్… నవంబర్ 15 నుంచి 20 మధ్య పోలింగ్!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 15 నుంచి 20 మధ్య జరుగుతాయని, ఓట్ల కౌంటింగ్ మాత్రం ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాతే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎలక్షన్ కమిషన్ కసరత్తును ప్రారంభించగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే తెలంగాణ ఎన్నిక ఉంటుందని సమాచారం. తొలుత డిసెంబర్ లో ఎన్నికలు జరపాలని నిర్ణయించినా, ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉండటం సబబుకాదన్న సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి వీలైనంత త్వరగానే ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ఓటర్ల తుది జాబితా వచ్చే నెల 8న విడుదల కానుండగా, ఆ వెంటనే రెండుమూడు రోజుల్లో అంటే అక్టోబర్ 10 లేదా 12న ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు. ఆపై పది రోజుల వ్యవధిలో నామినేషన్ల ప్రక్రియ ముగించి, రెండు వారాల వ్యవధిలో అంటే, నవంబర్ 15 నుంచి 20 మధ్య పోలింగ్ నిర్వహించవచ్చని ఆయన అన్నారు.

ఇప్పటికే పోలింగ్‌ ఏర్పాట్లు, శాంతిభద్రతలపై నివేదికలు తెప్పించుకుంటున్న ఎన్నికల సంఘం, తదుపరి అడుగులను శరవేగంగా వేస్తోంది. ఇక ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తే, నవంబర్ చివరి వరకూ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం లేదు.
Tags: Telangana, assembly, 2018 elections,november

Related posts

Leave a Comment