టిట్లీ భీభత్సం.. 12మంది మృతి

టిట్లీ తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో 12మంది మృతిచెందగా నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. ఈ సంఘటన ఒడిసాలోని గజపతి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. గురువారం గజపతి జిల్లాలోని బరఘారా గ్రామానికి చెందిన గిరిజనుల పాకలు టిట్లీ తుఫాను కారణంగా నేలమట్టమయ్యాయి. దీంతో తుఫాను బారినుంచి ప్రాణాలు రక్షించుకోవటానికి 22మంది గిరిజనులు దగ్గరలో ఉన్న కొండగుహలో తలదాచుకున్నారు. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగి గుహలో ఉన్న 16మంది గిరిజనులపై పడ్డాయి.

దీంతో 12మంది అక్కడిక్కడే మృతిచెందగా మరో నలుగురి ఆచూకీ గల్లంతయ్యింది. రాయగడా బ్లాక్‌ ఛైర్మన్‌ ధలేశ్వర్‌ భుయన్‌ మాట్లాడుతూ.. కొండచరియలు విరిగిపడి మరణించిన 12మంది మృతదేహాలను గుర్తించామన్నారు. మరో నలుగురి ఆచూకీ లభించలేదని తెలిపారు. గ్రామం మారుమూలన ఉండటం వల్లే ఈ విషాదం ఆలస్యంగా వెలుగుచూసిందని పేర్కొన్నారు.

Related posts

Leave a Comment