టాప్‌ 10 న్యూస్‌

1. ఉమ్మడి నౌకా స్థావరం ఏర్పాటుపై కలసిపనిచేయాలని భారత్‌, సీషెల్స్‌ సోమవారం నిర్ణయించాయి. ఈ విషయంలో పరస్పర ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని ముందడుగు వేయాలని తీర్మానించాయి. రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు సీషెల్స్‌కు 10 కోట్ల డాలర్ల రుణాన్ని భారత్‌ ప్రకటించింది. భారత పర్యటనలో ఉన్న సీషెల్స్‌ అధ్యక్షుడు డేనీ ఫార్‌ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రక్షణ సహా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సైబర్‌ భద్రత, నౌకాయానం సహా ఆరు అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

2. సార్వత్రిక ఎన్నికల్లో మూడోతరం (థర్డు జనరేషన్‌) ఓటింగ్‌ యంత్రాలను వినియోగించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ ఏడాది నవంబరు నాటికి అత్యాధునిక ఓటింగ్‌ యంత్రాలను సిద్ధం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐఎల్‌ (హైదరాబాద్‌), బీఈఎల్‌ (బెంగళూరు)లకు స్పష్టంచేసింది. దీంతో ఈ రెండుచోట్లా యుద్ధ ప్రాతిపదికన ఓటింగ్‌ యంత్రాలతోపాటు ఓటర్లు ఎవరికి ఓటు వేశామో చూసుకునేలా రసీదు ఇచ్చే యంత్రాలను (ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రైల్‌ – వీవీపీఏటీ) అనుసంధానించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 2014 సంవత్సరానికి ముందు తయారు చేసిన ఎం-2 యంత్రాలను వచ్చే ఎన్నికల్లో ఎక్కడా ఉపయోగించకూడదని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

3. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలీసుశాఖకు చెందిన కమాండ్‌ కంట్రోల్‌ జంట భవన నిర్మాణ పనుల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన భవనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీలైనంత త్వరలోనే నిర్మాణం పూర్తిచేసి వీటిని అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లో ఏడెకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ జంట భవనాలలో 5లక్షల చదరపు అడుగుల స్థలం ఉంటుంది. కేవలం శాంతిభద్రతల పర్యవేక్షణకు మాత్రమే కాకుండా పండుగలు, జాతరలు, ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినప్పుడు కూడా ఇక్కడ నుంచే పర్యవేక్షించవచ్చని, పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ భవనాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

4. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2013-14 ధరల ప్రకారం సవరించిన అంచనాలు ఆమోదించే లోగా తక్షణం రూ.10వేల కోట్లు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విన్నవించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక లేఖ రాశారు. ‘2010-11 అంచనాల ప్రకారం ఇంకా రూ.431.27 కోట్లు, ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన మొత్తంలో రూ.1504.14 కోట్లు (మొత్తం రూ.1935.41 కోట్లు) రావాలి. ఈ నిధులన్నీ తక్షణం అందించే ఏర్పాటు చేయాలి…’ అని ఆయన కోరారు. మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

5. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి స్వర్ణాభరణాలన్నీ భద్రంగానే ఉన్నాయని తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర యాదవ్‌ స్పష్టం చేశారు. బీరువాల్లో ఉన్న స్వామివారి ఆభరణాలను, తిరువాభరణం దస్త్రాలను, అన్నప్రసాదాల తయారీ పోటును ఆలయ అధికారులతో కలిసి మండలి అధ్యక్షుడు, సభ్యులు సోమవారం పరిశీలించారు. ‘తిరువాభరణం దస్త్రంలోని సమాచారం మేరకు ఆభరణాలను చూడగా అన్నీ కనిపించాయి. మా ప్రత్యక్ష పరిశీలనలో పగిలిపోయిన ‘రూబి’ కూడా కనిపించింది. పగిలిన ముక్కలు, పొడిని భద్రపర్చి ఉంచారు’ అని సుధాకరయాదవ్‌ వివరించారు. మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

6. ఉత్తరాంధ్రలో నైరుతీ రుతుపవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో పలు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీగానూ, మరికొన్నిచోట్ల మోస్తరుగానూ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికీ నైరుతీ రుతుపవనాలు బలహీనంగానే ఉన్నాయి. మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

7. నేడూ సూచీలు నష్టాల్లోనే ట్రేడయ్యే అవకాశం ఉంది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయంతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతలు కొనసాగుతాయని, ఈ ప్రభావం మన సూచీలపై కూడా పడే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యూరోపియన్‌ కార్లపై దిగుమతి సుంకాలు పెంచుతామని ట్రంప్‌ తాజాగా హెచ్చరించడంతో మదుపర్లు షేర్ల కొనుగోలులో ఆచితూచి వ్యవహరించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్‌ దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని, ఇదే సమయంలో ఐటీ, పార్మా రంగాల షేర్లపై మదుపర్లు కన్నేయొచ్చని ఓ డీలరు చెబుతున్నారు. వీటితోపాటు సిమెంటు రంగ షేర్లలో కదలికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మరింత సమాచారం కోసం క్లిక్‌ చేయండి!

8. స్పెయిన్‌, మొరాకో మధ్య జరిగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది. 14వ నిమిషంలో మొరాకో ఫార్వర్డ్‌ ఆటగాడు బౌటెయిబ్‌ గోల్‌ కొట్టి జట్టు ఖాతా తెరిచాడు. అక్కడికి కొద్దిసేపటికే స్పెయిన్‌ మిడ్‌ఫీల్డర్‌ ఇస్కో 19వ నిమిషంలో గోల్‌ చేసి సమం చేశాడు. చాలాసేపటి తర్వాత 81వ నిమిషంలో ఫార్వర్డ్‌ ప్లేయర్‌ ఎన్‌-నెసైరి గోల్‌ కొట్టి మొరాకోకు ఆధిక్యం అందించాడు. ఇంజూరి సమయంలో (90’+1′) స్పెయిన్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు ఇయాగో అస్పస్‌ గోల్‌ చేసి మ్యాచ్‌ను డ్రా చేశాడు. స్పెయిన్‌ ఆటగాడు ఇస్కో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ను డ్రా చేసుకున్న స్పెయిన్‌ గ్రూప్‌-బిలో తొలి స్థానంలో నిలిచింది. నాకౌట్‌లో రష్యాతో తలపడనుంది.

9. ఇరాన్‌, పోర్చుగల్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. విజయం ముంగిట ఉన్న పోర్చుగల్‌ను ఓ పెనాల్టీ దెబ్బ తీసింది. పోర్చుగల్‌ విజయం తథ్యం అనుకుంటున్న సమయంలో ఇంజూరీ సమయంలో ఇరాన్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు కరీమ్‌ అన్సరీఫర్ద్‌ పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి మ్యాచ్‌ను సమం చేశాడు. మ్యాచ్‌ సాంతం పోర్చుగల్‌ ఆధిప్యతంలోనే కొనసాగింది. 45వ నిమిషంలో క్వారెస్మా గోల్‌ చేసి పోర్చుగల్‌ ఖాతా తెరిచాడు. ద్వితీయార్ధంలో ఇరుజట్లు గోల్‌ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 90+3 నిమిషంలో కరీమ్‌ పెనాల్టీ గోల్‌ చేశాడు. దీంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. గ్రూప్‌-బి పాయింట్ల పట్టికలో పోర్చుగల్‌ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పోర్చుగల్‌ ఫార్వర్డ్‌ ఆటగాడు రికార్డో క్వారెస్మా మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

10. ఫిఫా ప్రపంచకప్‌లో ఈ రోజుల నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్‌-సిలో ఆస్ట్రేలియా, పెరు మధ్య రాత్రి 7.30కి మ్యాచ్‌ జరుగుతుంది. అదే గ్రూప్‌ నుంచి డెన్మార్క్‌, ఫ్రాన్‌ తలపడనున్నాయి. ఇది కూడా రాత్రి 7.30కే మొదలవుతుంది. గ్రూప్-డిలో 11.30కి నైజీరియా, అర్జెంటీనా మ్యాచ్‌ మొదలవుతుంది. ఈ గ్రూప్‌కు చెందిన ఐస్‌లాండ్‌, క్రొయేషియా పోరు కూడా అదే సమయానికి జరుగుతుంది.

Related posts

Leave a Comment