టాప్‌ 10 న్యూస్‌- 9AM

1. సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులకు మరణ దండన సరైనదేనని సుప్రీంకోర్టు సోమవారం తన తీర్పు ద్వారా పునరుద్ఘాటించింది. మరణదండనను సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ ముగ్గురు దోషులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. వారి అభ్యర్థనకు ప్రాతిపదిక లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.బానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

2. తెలంగాణలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ,ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కేటాయింపు గరిష్ఠంగా 50 శాతానికి మించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. షెడ్యూల్డ్‌ ప్రాంత ఎస్టీల రిజర్వేషన్‌ వర్తింపునకు 50 శాతంలోపు నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఈ స్థానాలకు 50 శాతానికి మించి రక్షణ ఉందని తెలిపింది. మరింత సమాచారం కోసం..

3. ఒకవర్గం వారి మనోభావాలు రెచ్చగొట్టి తద్వారా హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కత్తిమహేష్‌ను హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. మళ్లీ నగరంలోకి రావడానికి అతను ప్రయత్నిస్తే అరెస్టు చేస్తామని, ఈ నేరానికిగాను మూడేళ్ల జైలుశిక్ష పడుతుందన్నారు. ఒకవేళ సామాజిక మధ్యమాల ద్వారా రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌ డీజీపీతోనూ మాట్లాడతామన్నారు. మరింత సమాచారం కోసం..

4. ‘‘అమరావతిని హరిత నగరంగా నిర్మిస్తున్నాం. పచ్చటి ఉద్యానవనాలు, సుందరమైన కాలువలతో అమరావతి శోభిల్లుతుంది. నూరుశాతం ఎలక్ట్రిక్‌ వాహనాలే వినియోగిస్తాం. ప్రమాణాల మేరకే కార్బన్‌ డయాక్సైడ్‌ ఉండే (సీఓ2 న్యూట్రల్‌) వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం. అత్యవసర సేవలకు ఐదు నిమిషాల్లో, సామాజిక అవసరాలకు 10 నిమిషాల్లో, కార్యాలయాలకు 15 నిమిషాల్లో కాలినడకన చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్రంలో పెట్టుబడిలేని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ… ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడున్న ఎవరైనా సరే అమరావతికి వచ్చి స్థిరపడొచ్చు. అక్కడుంటే మీ ఆయుష్షు పెరుగుతుంది’’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు సింగపూర్‌ వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం రెండో రోజు ‘‘పట్టణీకరణ-నీరు, పర్యావరణం, ప్రజా రవాణా నిర్వహణ’ అన్న అంశంపై జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం..

5. మొబైల్‌ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో పెద్ద దేశంగా భారత్‌ అవతరించిందని ప్రధాని మోదీ చెప్పారు. భారత్‌లో తయారీ కార్యక్రమాన్ని తన ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో ఇది సాధ్యమయిందన్నారు. నాలుగేళ్ల క్రితం మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు దేశంలో రెండే ఉండగా ఇప్పుడు 120కి చేరాయన్నారు. వీటిల్లో నోయిడాలోనే 50శాతం ఉన్నాయన్నారు. దిల్లీ శివారుల్లో ప్రపంచంలోనే పెద్దదైన మొబైల్‌ ఫోన్ల తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన సందర్భంగా మోదీ మంగళవారం ప్రసంగించారు. మరింత సమాచారం కోసం..

6. ఆంధ్రప్రదేశ్‌ బ్రాండ్‌గా బొంగు(బ్యాంబూ) బిర్యానీని ప్రచారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికనూ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల బిర్యానీ అనగానే హైదరాబాద్‌ను గుర్తు చేసుకుంటారు. అదే స్థాయిలో బొంగు బిర్యానీ అనగానే ఏపీని గుర్తుచేసుకునే స్థాయిలో ప్రమోట్‌ చేయాలని, ఈ బిర్యానీని విస్తృత వినియోగంలో తేవాలని నిర్ణయించారు. ఇందుకోసం హోటళ్లలో పనిచేస్తున్న చెఫ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా ఆహారాన్ని(ఫుడ్‌) ప్రచారంలోకి(ప్రమోట్‌) తెచ్చేందుకు వార్షిక ప్రణాళికను పర్యాటక శాఖ సిద్ధం చేసింది. మరింత సమాచారం కోసం..

7. కేరళలోని పద్మనాభస్వామి ఆలయానికి చెందిన విలువైన సంపదను మ్యూజియంలో ప్రదర్శించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను ట్రావన్‌కోర్‌ రాచకుటుంబ సభ్యుడు ఆదిత్య వర్మ వ్యతిరేకించారు. పవిత్రమైన దేవుడి సంపదతో ‘వ్యాపారం’ చేయడానికి తాను సమ్మతించబోనని స్పష్టంచేశారు. ఆలయంలో దశాబ్దాలుగా మూతపడ్డ ఆరు సెల్లార్‌లను 2011లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తెరిచారు. అందులో బంగారు, వెండి ఆభరణాలు, నాణెలు, విలువైన రాళ్లు పొదిగిన కిరీటాలు తదితర అమూల్య సంపద బయటపడింది. దీని విలువ రూ.లక్ష కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఈ సంపదను ప్రదర్శించేందుకు ఒక అధునాతన మ్యూజియంను ఏర్పాటు చేద్దామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఆదిత్య వర్మను సంప్రదించాయి. దీన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన తాజాగా పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం..

8. లోకాయుక్త బిల్లుకు తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉన్నతస్థానాల్లోని వ్యక్తులపై ఆరోపణలు, అవినీతి వ్యవహారాలను విచారించడానికి లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం-2013ను కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే. దీన్ని అనుసరించి తమిళనాడులో లోకాయుక్తను ఏర్పాటుచేయాలని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే సహా పలు రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. శాసనసభ సమావేశాల చివరి రోజైన సోమవారం సంబంధిత బిల్లును మంత్రి డి.జయకుమార్‌ సభలో ప్రవేశపెట్టారు.

9. భాజపాతో మైత్రి బిహార్‌కే పరిమితమని జేడీయూ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ సోమవారం స్పష్టీకరించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కమలనాథులతో ఉన్న విభేదాలు సద్దుమణిగేందుకు కొంచెం సమయం పడుతుందని తెలిపారు. తమ మైత్రికి ఎలాంటి బీటలూ వారలేదని వ్యాఖ్యానించారు. భాజపా వ్యతిరేక కూటమితో కలిసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.

10. చిత్తూరు జిల్లా కురబలకోటలో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ను ద్విచక్ర వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులను కురబల కోటకు చెందిన చంద్రశేఖర్‌ (45), దేవేంద్ర (13), దినేష్‌ (16)గా గుర్తించారు.

Related posts

Leave a Comment