టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

1. బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేసిన ధీశాలి, తమిళ ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు, రాష్ట్రంతోపాటు జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన ధ్రువతార దివికేగింది. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఓటమెరుగని నేతగా, ఒకే పార్టీకి 50 సంవత్సరాలు అధ్యక్షుడిగా కొనసాగి రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన మేరునగధీరుడు, డీఎంకే అధినేత ఎం కరుణానిధి (94) మంగళవారం కన్నుమూశారు. 15 రోజులుగా అనారోగ్యంపై చేసిన పోరాటంలో ఓడిపోయి సాయంత్రం 6.10 గంటలకు మరణించారు. ‘డాక్టర్ల బృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిరంతరం వైద్య సేవలందించినా కలైంజర్‌ను కాపాడుకోలేకపోయాం. ఆయన మరణాన్ని ఎంతో ఆవేదనతో ప్రకటిస్తున్నాం. సాయంత్రం 6.10 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు’ అని కావేరి ఆసుపత్రి యాజమాన్యం రాత్రి 6.40 గంటల సమయంలో వెల్లడించింది.

2. మిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి భౌతిక దేహానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం, సీనియర్‌నేత తంబిదురై నివాళులర్పించారు. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం కరుణానిధి పార్థివ దేహాన్ని ప్రభుత్వ ఎస్టేట్‌లోని రాజాజీ హాలులో ఉంచారు. తొలుత ఆసుపత్రి నుంచి ఆయన పార్దీవ దేహాన్ని గోపాలపురంలోని ఆయన ఇంటికి మంగళవారం రాత్రి తరలించారు. పశ్చిమ్‌ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్దీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అర్థరాత్రి ఒంటి గంట వరకూ అక్కడే కుటుంబ సభ్యులు, బంధువులు నివాళులర్పించారు. అక్కడి నుంచి సీఐటీ కాలనీలోని కనిమొళి నివాసానికి తరలించారు. అక్కడా కుటుంబ సభ్యులు నివాళులర్పించాక రాజాజీ హాలుకు తరలించారు.

3. రాజ్యసభ ఉప ఛైర్మన్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి హరివంశ్‌నారాయణ్‌సింగ్‌కు మద్దతు ఇవ్వాలని జనతాదళ్‌ (యు)అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ను కోరారు. మంగళవారం ఆయన కేసీఆర్‌కు ఫోన్‌ చేసి ఎన్డీయే అభ్యర్థిగా తమ పార్టీ ఎంపీ పోటీ చేస్తున్నారని, ఆయన విజయానికి ఆరుగురు సభ్యులున్న తెరాస మద్దతు ఎంతోకీలకమని అన్నారు. ఆది నుంచి తెరాసకు అండగా ఉన్నామని, తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చామని తెలిపారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు సహకరించాలని కోరారు.

4. దివంగత నేత కరుణానిధి అంత్యక్రియలు చేపట్టాల్సిన స్థలం విషయంలో డీఎంకేకు, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. మెరీనా బీచ్‌లో స్థలమివ్వాలన్న డీఎంకే డిమాండును సర్కారు తోసిపుచ్చింది. దీనిపై డీఎంకే హైకోర్టును ఆశ్రయించగా.. అర్ధరాత్రి న్యాయమూర్తులు విచారించారు. బుధవారం ఉదయం 8 గంటల్లోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఇతర నేతల అంత్యక్రియలకు స్థలం ఇచ్చినట్టుగానే సీనియర్‌ నేత కరుణానిధికి ఎందుకివ్వకూడదని ప్రశ్నించింది.
5. దేశంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా కలత చెందింది. అక్కడా ఇక్కడా అని లేకుండా ఎక్కడపడితే అక్కడ ప్రతిరోజూ చాలా మంది ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సంరక్షణ కేంద్రాల్లో బాలికల రక్షణపై ఆందోళన వెలిబుచ్చింది. అత్యాచారాల నియంత్రణకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ముజఫర్‌పుర్‌లోని సంరక్షణ కేంద్రంలో బాలికలపై అత్యాచారాలు దారుణమని అభివర్ణించింది. ప్రజల నుంచి వసూలు చేసే సొమ్మును ఇటువంటి దారుణాలకు ఖర్చుపెడుతున్నారా అని బిహార్‌ ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది.

6. డీఎంకే అధ్యక్షుడు, తన తండ్రి కరుణానిధి మరణవార్త వెలువడిన వెంటనే పార్టీ శ్రేణులు, అభిమానులను శాంతియుతంగా ఉండాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు. హింసాత్మక ఘటనలకు తావివ్వవద్దని, పోలీసులకు సహకరించి పార్టీలోని క్రమశిక్షణను చాటాలని పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచి కరుణానిధి పార్థివదేహాన్ని గోపాలపురంలోని నివాసానికి తరలించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. మహానేత అంత్యక్రియలకు మెరీనాలో చోటు కల్పించాలని డీఎంకే హైకోర్టును ఆశ్రయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయిన మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఓబీసీ వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. మరాఠాలకు ఉద్యోగాల్లో కోటా కల్పించే అవకాశం ఉండడంతో ఓబీసీ వర్గాలు ఆందోళన చెందుతున్న విషయాన్ని గమనించి వారికి దేవేంద్ర ఫడణవిస్‌ ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఓబీసీ వర్గానికి చెందిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఓబీసీ కార్పొరేషన్‌కు వచ్చే రెండు బడ్జెట్‌లలో రూ.500 కోట్లు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ముంబయిలో నిర్వహించిన రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్‌ మూడో జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

8. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందని మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్ట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టిన దీక్షకు మంగళవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అంశంపై తనకు అవగాహన ఉందన్నారు. కర్ణాటకలోనూ వర్గీకరణ ఉద్యమానికి అండగా ఉంటానన్నారు.

9. తమది చేతల…చేనేత ప్రభుత్వమని, తెలంగాణలో ఈ రంగం అభివృద్ధికి బహుముఖ వ్యూహంతో పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలన్నీ ఆగిపోవాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. మంగళవారం పీపుల్స్‌ప్లాజాలో ఆయన జాతీయ చేనేత దినోత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. ‘చేనేత కార్మికులకు సంపూర్ణ భరోసాతో నిరంతర ఉపాధి కల్పిస్తూ, ఆత్మవిశ్వాసం, గౌరవంతో బతికేందుకు కృషి చేస్తున్నాం.ఈ ఏడాది రూ.400 కోట్లను వెచ్చిస్తున్నాం.కేంద్ర బడ్జెట్‌తో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం ఈ రంగానికి కేటాయించిన నిధులు చాలా ఎక్కువ. త్వరలోనే టెస్కో దుకాణాల సంఖ్య పెంచుతాం. అన్ని రకాల వస్త్రాలను ఉత్పత్తి చేసేలా చేనేత సంఘాలకు, కార్మికులకు చేయూతనిస్తాం’ అని కేటీఆర్‌ తెలిపారు.

10. డీఎస్సీ-1998 నియామకాలకు సంబంధించి ‘సవరించిన మెరిట్‌ జాబితా’ను తెలంగాణ విద్యాశాఖ మంగళవారం హైకోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఆ వివరాల్ని పరిశీలించి స్పందన తెలియజేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు న్యాయమూర్తి సూచించారు. విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీచేశారు. డీఎస్సీ-1998 మెరిట్‌ జాబితాలో అవకతవకలను సరిదిద్ది, తాజాగా జాబితాను విడుదల చేయాలని హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కొంతమంది అభ్యర్థులు కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

Related posts

Leave a Comment