టాప్‌ 10 న్యూస్‌- 9AM

1. కరుణానిధి ఆరోగ్యంపై ఆదివారం రాత్రి మరోసారి అయోమయం నెలకొంది. రాత్రి 10.50కి కావేరి ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్‌బులిటెన్‌లో కరుణానిధి ఆరోగ్యం కొద్ది సమయం విషమించిందని పేర్కొన్నారు. అయితే నిపుణులైన వైద్యబృందం పర్యవేక్షణలో చికిత్సకు స్పందిస్తున్నారనీ తెలిపారు. దీనికి తోడు సేలం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అర్ధంతరంగా పర్యటనను ముగించుకుని చెన్నైకి వస్తున్నారన్న ప్రచారంతో డీఎంకే కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. డీఎంకే సీనియర్‌ నేత ఎ.రాజా మీడియాతో మాట్లాడుతూ…కరుణానిధి ఆరోగ్యం కుదుటపడిందని, ఆయన కోలుకుంటున్నారని, వందతులు నమ్మొద్దని చెప్పారు. భారీగా డీఎంకే కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం..

2. ‘కాపు రిజర్వేషన్‌పై హామీ ఇవ్వలేనన్న మీకు.. మేమెందుకు ఓటు వేయాలి’ అని వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిలదీశారు. కాపు రిజర్వేషన్‌ అంశం రాష్ట్ర పరిధి కాదు.. కేంద్రం చేయాల్సిన పని అని జగన్‌ చెప్పడం బాధగా, వింతగా ఉందన్నారు. తుని బహిరంగ సభ రోజున, అసెంబ్లీలో కాపుల డిమాండును సమర్థించి.. ఇప్పుడు ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారని ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం..

3. పాకిస్థాన్‌ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14లోగా ఇమ్రాన్‌ ఖాన్‌ దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పేర్కొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చిన్నపార్టీలు, స్వతంత్రులతో ఆ పార్టీ చర్చలు జరుపుతోంది. ఈ నెల 25న జరిగిన పాకిస్థాన్‌ పార్లమెంటరీ ఎన్నికల్లో పీటీఐ.. 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యను మాత్రం సాధించలేకపోయింది. మరింత సమాచారం కోసం..

4. భారత సంతతికి చెందిన ఓ బాలుడు అమెరికాలో అద్భుత ఘనత సాధించాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డ తాజి, బిజౌ అబ్రహం దంపతుల కుమారుడు తనిష్క్‌ అబ్రహం. డేవిస్‌ నగరంలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తనిష్క్‌ తాజాగా డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులో బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా పొందాడు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయినందుకు చాలా సంతోషంగా, ఉద్వేగంగా ఉందని తనిష్క్‌ చెప్పాడు. తాను సాధించిన ఘనత పట్ల గర్వంగా ఉందన్నాడు. మరింత సమాచారం కోసం..

5. పాకిస్థాన్‌ జైళ్లలో 471 మంది భారతీయులు ఉన్నారని, వారిలో 418 మంది మత్స్యకారులని పాక్‌ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆదివారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. భారత్‌ జైళ్లలో 357 పాకిస్థానీయులు ఉన్నారని, వారిలో 108 మంది మత్స్యకారులని పేర్కొంది. 2016లో భారత్‌ 114 మంది పాక్‌ ఖైదీలను విడుదల చేయగా, పాకిస్థాన్‌ 941 మంది ఖైదీలను విడుదల చేసింది. మరింత సమాచారం కోసం..

6. జీవిత బీమా సంస్థల వద్ద ఎవ్వరూ క్లెయిమ్‌ చేయని రూ.15,167 కోట్ల సొమ్ము ఉందని బీమా నియంత్రణ, అభివృద్థి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) వెల్లడించింది. పాలసీదార్లు లేదా లబ్ధిదారులను గుర్తించి, క్లెయిమ్‌లను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా బీమా సంస్థలను ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. పాలసీదారులకు గడువులోగా సొమ్ము చెల్లించేందుకు బోర్డు స్థాయి కమిటీ నిరంతరం బీమా సంస్థలను పర్యవేక్షిస్తుంది. క్లెయిమ్‌లు అందేలా చర్యలు చేపడుతుంది. ఈ ఏడాది మార్చి ముగిసేసరికి ఎవరూ క్లెయిమ్‌ చేయని రూ.15,166.47 కోట్లు బీమా సంస్థల వద్ద ఉండగా… ఇందులో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) వద్దే రూ.10,509 కోట్లు ఉండటం విశేషం. మరింత సమాచారం కోసం..

7. సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్‌ల్లో తినుబండారాలను గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)కే విక్రయించాలని తూనికలు, కొలతలశాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆదేశించారు. శీతల పానియాలు, మంచినీటి సీసాలకూ ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలను అమలుచేసే విషయమై ఆ శాఖ అసిస్టెంటు కంట్రోలర్‌లు, ఇన్‌స్పెక్టర్లతో హైదరాబాద్‌లో ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా అకున్‌ సబర్వాల్‌ మాట్లాడుతూ… ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలపై వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎమ్మార్పీ, తయారీదారు చిరునామా, కస్టమర్‌ కేర్‌ వివరాలు ఉండాలన్నారు. మరింత సమాచారం కోసం..

8. వివిధ వ్యాజ్యాలకు సంబంధించి న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వుల్లో సహేతుక కారణాలను పేర్కొనాలని సుప్రీంకోర్టు పేర్కొంది. భవిష్య నిధి చందాల విషయమై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచి ఇచ్చిన తీర్పును తిప్పిపంపించింది. తాజా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జస్టిస్‌ ఎం.ఎం.సప్రే, జస్టిస్‌ నవీన్‌ సిన్హాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఏ కేసును ఎందుకు ఓడిపోయామో, ఎందుకు గెలిచామో సంబంధిత వ్యక్తులకు అర్థమయ్యేలా ఆదేశాలు ఉండాలని పేర్కొంది. మరింత సమాచారం కోసం..

9. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం అసమర్థంగా ఉందని కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి చర్యలను తప్పుపట్టారు. పెట్టుబడులు తగ్గుముఖంపట్టడం, బ్యాంకులు రుణాలను ఇవ్వడం తగ్గించడంతో దేశ వృద్ధి రేటు నెమ్మదించిందని అన్నారు. ‘భారత్‌ ముందున్న సవాళ్లు’ అనే పేరుతో ఆదివారం చెన్నైలో జరిగిన సదస్సులో చిదంబరం ప్రసంగించారు.

10. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబాన్ని మాత్రమే బంగారుమయం చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుందన్నారు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌లో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మరింత సమాచారం కోసం..

Related posts

Leave a Comment