టాప్‌ 10 న్యూస్‌

1. కడప జిల్లాలోని చెన్నూరు మండలం పాలెంపల్లి టోల్‌గేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు భాగ్యలక్ష్మి(60), మస్తాన్‌రావు(55)గా.. క్షతగాత్రులు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట వాసులుగా గుర్తించారు. వైద్య పరీక్షల కోసం బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

2. అమర్‌నాథ్‌ యాత్ర.. వాతావారణ ప్రభావంతో వాయిదా పడింది. నిన్న సాయంత్రం నుంచి జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం 5 గంటలకు యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షాల కారణంగా వాయిదా పడింది. కాగా ఇప్పటికే భక్తులు యాత్ర కోసం బల్తాల్‌, పహెల్‌గావ్‌ క్యాంపులకు చేరుకున్నారు. వర్షాల దృష్ట్యా టెంట్ల నుంచి బయటకు రావొద్దని భక్తులకు అధికారులు సూచించారు.

3. ఉత్తర్‌ప్రదేశ్‌లో 10 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అదృశ్యమయ్యారు. ప్రత్యేక రైలులో జమ్ముకశ్మీర్‌కు వెళ్తుండగా ముగల్‌సరైయి వద్ద జవాన్లు కనిపించకుండా పోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

4. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించనున్నారు. బేగంపేటనుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబ సమేతంగా విజయవాడకు వెళతారు. తెలంగాణ వస్తే దుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పిస్తానన్న మొక్కును ఆయన చెల్లించుకోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తెలంగాణ ప్రభుత్వం తమ పట్ల అవలంబిస్తోన్న మొండి వైఖరికి నిరసనగా గురువారం నుంచి మూకుమ్మడి సెలవులు పెట్టాలని తెలంగాణ రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు బుధవారం డీలర్లకు పిలుపునిచ్చారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని రేషన్‌ డీలర్లు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. డీడీలు కట్టకుంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించడం విచారకరమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పౌర సేవలు వంటివి పొందడానికి ఏ ప్రభుత్వోద్యోగికి ఒక్క పైసా కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. డబ్బుల కోసం ఎవరైనా డిమాండు చేస్తే పరిష్కార వేదిక 1100 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. రాష్ట్రంలో నూటికి 95శాతం మంది ఉద్యోగులు నిజాయతీగానే ఉంటున్నారని, అవినీతి జబ్బున్న కొందరు మాత్రమే చెడుమార్గాల్లో వెళ్తున్నారని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ కేంద్రం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా బుధవారం ఆయన విజయవాడ, గుంటూరులో నూతనంగా నిర్మించిన ఏసీబీ రేంజి కార్యాలయాల భవనాల్ని ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.బి.రాధాకృష్ణన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ కుమార్‌ త్రిపాఠిని అదే న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ కొనసాగుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. దేశంలో ఉన్నత విద్య నియంత్రణకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్‌ఆర్‌డీ) నూతన చట్టాన్ని తీసుకురానుంది. ఇప్పటివరకు ఉన్న విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌-యూజీసీ)ని రద్దు చేసి కొత్తగా ఉన్నత విద్య కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రూపొందించిన నూతన ముసాయిదా చట్టంలో దీన్ని ప్రస్తావించింది. నూతన కమిషన్‌ కేవలం విద్యా సంబంధమైన విషయాలకే పరిమితమవుతుంది. నిధుల కేటాయింపు వంటి ఆర్థిక వ్యవహారాలను నేరుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖే చూస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చెల్లింపు వార్తల ఆరోపణలపై మధ్యప్రదేశ్‌లో భాజపా మంత్రి నరోత్తమ్‌ మిశ్రపై ఎన్నికల సంఘం (ఈసీ) వేసిన మూడేళ్ల అనర్హత వేటును, దానిని సమర్థిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. పత్రికల్లోని అంశాలను ఈసీ నియంత్రించజాలదని స్పష్టం చేసింది. ఒక అభ్యర్థి ఎన్నికల్లో చేసిన ఖర్చుకు సెక్షన్‌-77 కింద లెక్క చూపిస్తున్నారా లేదా అనే విషయం వరకే ఈసీ చూసుకోవాలనీ, వ్యక్తీకరణలోని అంశాలను మాత్రం కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇటీవల తీర్పు వెలువరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి గ్రూప్‌ ఈ జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. సెర్బియా, బ్రెజిల్‌ పోరులో 2-0 తేడాతో బ్రెజిల్‌ విజయం సాధించింది. మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా బ్రెజిల్‌ ఆటగాడు పాలినో ఎంపికయ్యాడు. మరో మ్యాచ్‌లో స్విట్జార్లాండ్‌, కోస్టారికా తలపడగా ఇరుజట్లు 2-2 స్కోరు చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించాయి. స్విట్జర్లాండ్‌ ఆటగాడు జెమైలీ మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Related posts

Leave a Comment