టాప్‌ 10 న్యూస్‌ – 10AM

1. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనంవల్ల తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో అతి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరకోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర తీరం వెంబడి అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో ఆ ప్రభావంతో బుధ, గురువారాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు శుక్రవారం ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ప్రాంతంలో రానున్న మూడురోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాస్త్రవేత్త నాగరత్న తెలిపారు.

2. భారతీయ జనతా పార్టీ(భాజపా) జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శుక్రవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం 10.30కి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తారు. తొలుత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఫుల్‌టైమర్లతో.. తర్వాత కోర్‌కమిటీ, ప్రధాన కార్యదర్శులతో కూడిన పార్టీ రాష్ట్ర ఎన్నికల సన్నాహక కమిటీతో విడివిడిగా సమావేశం అవుతారు. ఆరెస్సెస్‌ నేతలతోనూ అమిత్‌షా సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు కాంగ్రెస్‌లో చేరనున్నారు. 2014 ఎన్నికల తర్వాత నాలుగేళ్లపాటు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యుడు ఊమెన్‌ చాందీతో భేటీ అయ్యారు. చాందీ ఆహ్వానం మేరకు తిరిగి కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించిన ఆయన గురువారం దిల్లీకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్‌లో చేరనున్నారు.

4. జులై 15 నాటికి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 1,500 రోజులు అవుతుందని జులై 16 నుంచి గ్రామదర్శిని-గ్రామ వికాసం ద్వారా ప్రజల్లోకి వెళ్దామని ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు. ‘‘75 నుంచి 100 రోజుల కార్యక్రమం తీసుకుని పనిచేద్దాం. మనం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితి ఏంటి? ఈ 1,500 రోజుల్లో ఏం చేశాం.. అనే దానిపై చర్చ జరగాలి. ప్రజలకు అవగాహన కలిగేలా చెప్పాలి. విభజన నష్టాన్ని గుర్తు చేయాలి. వచ్చే అయిదారు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 సభలకు తాను హాజరవుతానని తెలిపారు. ఉండవల్లిలో ప్రజాదర్బార్‌ హాలులో గురువారం నిర్వహించిన తెదేపా కార్యశాలకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

5. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన 4,383 పంచాయతీలు ఆగస్టు 2వతేదీ నుంచి ఉనికిలోకి రానున్నాయి. అవి ప్రస్తుతం ఏపంచాయతీ నుంచి వేరుపడ్డాయో అందులో కొందరు సిబ్బందిని కొత్తవాటికి విభజిస్తారు. ఆస్తులనూ పంపిణీ చేస్తారు. పంచాయతీ కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్న భవనాలను ఎంపిక చేస్తారు. ఇలాంటి ప్రధాన ప్రక్రియలను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలంటూ అధికారులను పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.

6. పరస్పరాంగీకార స్వలింగ సంపర్కం నేరం కాదని తేలిపోతే, ఎల్‌జీబీటీక్యూ వర్గంపై వివక్ష, సామాజిక కళంకం వంటి అంశాలన్నీ కూడా మాయమవుతాయని సుప్రీంకోర్టు గురువారం చెప్పింది. భారత సమాజంలో ఏళ్ల తరబడి ఏర్పడిన ఒక వాతావరణం ఈ వర్గంపై తీవ్ర వివక్షకు దారి తీసిందని, ఫలితంగా వారి మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. సెక్షన్‌ 377పై కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టులో ఒక వైఖరిని వెల్లడించి, ఇప్పుడు ఆ సెక్షన్‌పై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వివేచనకే వదిలేస్తున్నట్లు చెప్పి యూటర్న్‌ తీసుకుందని మనోజ్‌ జార్జి అనే న్యాయవాది ఆరోపించారు. ఈ ఆరోపణను ధర్మాసనం తోసిపుచ్చింది.

7. దాదాపు 23 ఏళ్ల క్రితం బయటపడిన యూరియా కుంభకోణంలో నిందితులైన ఇద్దరు టర్కీ జాతీయులకు రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పునిచ్చింది. అవినీతి కేసుల్లో ఇంత భారీ మొత్తాలను జరిమానాగా విధించడం అరుదు. టర్కీకి చెందిన కర్సన్‌ లిమిటెడ్‌ మాజీ కార్యనిర్వహణాధికారులు- టన్‌కే అలంకుస్‌, చిహన్‌ కరాన్సీలకు చెరో ఆరేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష కూడా విధించింది. కేంద్ర మాజీ మంత్రి రామ్‌లఖన్‌సింగ్‌ యాదవ్‌ తనయుడు ప్రకాశ్‌చంద్ర యాదవ్‌, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు సంజీవరావులకు చెరో రూ.కోటి జరిమానా, మూడేళ్ల జైలు పడింది.

8. ‘యూటీఎస్‌’ మొబైల్‌ యాప్‌ సేవలను ఈ నెల 16 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని దక్షిణమధ్యరైల్వే నిర్ణయించింది. కాగితరహిత సాధారణ టికెట్లతో పాటు ప్లాట్‌ఫాం, సీజన్‌ టికెట్లను కూడా ఈ యాప్‌ ద్వారా తీసుకోవచ్చు. ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌, డెమో,మెమూ రైళ్లలో సాధారణ టికెట్లు తీసుకోవచ్చు. ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు తమ వ్యాలెట్‌ రీఛార్జిపై 5 శాతం బోనస్‌ ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. బ్యాంకు ఖాతా నుంచి ఈ వ్యాలెట్‌లోకి రూ.500 రీఛార్జి చేస్తే మరో రూ.25 జమ చేస్తామని రైల్వేవర్గాలు చెబుతున్నాయి.

9. ఫేస్‌బుక్‌ ఖాతాలకు సంబంధించి జర్మనీ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పిల్లల ఖాతాల గురించి తెలుసుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని స్పష్టం చేసింది. ఖాతాలు నిర్వహిస్తున్న చిన్నారులు మరణిస్తే.. వాటిలోని వివరాలు పొందేందుకు తల్లిదండ్రులను అనుమతించొచ్చని తేల్చిచెప్పింది. 2012లో 15 ఏళ్ల ఓ బాలిక రైలు ప్రమాదంలో మృత్యువాతపడింది. ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాలోని ఫొటోలు, ఇతర పోస్టులు చూసేందుకు తనకు అవకాశం కల్పించాలని బాలిక తల్లి ఏడాది కాలంగా కోర్టులో పోరాడుతోంది. సంబంధిత పిటిషన్‌పై విచారణ నిర్వహించిన ఫెడరల్‌ కాన్‌స్టిట్యూషనల్‌ కోర్టు.. మృతురాలి తల్లికి అనుకూలంగా గురువారం తీర్పు వెలువరించింది.

10. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత్‌కు అదిరే ఆరంభం. బౌలింగ్‌లో స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌, బ్యాటింగ్‌లో రోహిత్‌, కోహ్లి సత్తా చాటడంతో తొలి వన్డేలో టీమ్‌ఇండియాకు ఎదురేలేకపోయింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌.. కుల్‌దీప్‌ ధాటికి 49.5 ఓవర్లలో 268 పరుగులకే ఆలౌటైంది. బట్లర్‌ (53) టాప్‌ స్కోరర్‌. రోహిత్‌ సెంచరీతో చెలరేగడంతో లక్ష్యాన్ని భారత్‌ 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరోవైపు ఐఏఏఎఫ్‌ ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా హిమ దాస్‌ చరిత్ర సృష్టించింది. మహిళల 400మీ పరుగులో ఆమె విజేతగా నిలిచింది. 18 ఏళ్ల హిమ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత ట్రాక్‌ అథ్లెట్‌గా కూడా హిమ ఘనత సాధించింది.

Related posts

Leave a Comment