టాప్‌ 10 న్యూస్‌ @ 10AM

1. కేంద్రం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజారవాణా సంస్థలు ప్రకటించిన బంద్‌ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్‌ ప్రభావం కనిపిస్తోంది. వివిధ డిపోల్లోని బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఒక రోజు సమ్మెలో పాల్గొనాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలూ నిర్ణయించాయి. మొదటి షిఫ్టు నుంచే కార్మికుల విధుల దూరంగా ఉన్నారు. అధికారిక కార్మిక సంఘం కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించిన నేపథ్యంలో బస్సులు నడిచే అవకాశం లేదని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సిటీ బస్సుల మొదలు దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను ముందుజాగ్రత్తగా నిలిపి వేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.

2. పెప్సికో సీఈఓ బాధ్యతల నుంచి ఇంద్రా నూయి తప్పుకోనున్నట్లు కంపెనీ ప్రకటించింది. గత 12 ఏళ్లుగా ఈ హోదాలో సేవలు అందించిన నూయి భారత సంతతి మహిళ కావడం విశేషం. 24 ఏళ్ల కిందట ఈ కంపెనీలో చేరిన 62 ఏళ్ల నూయి అక్టోబరు 3న సీఈఓ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే 2019 మొదట్లో కొన్నాళ్ల వరకూ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. కాగా, ఈమె స్థానంలో రామన్‌ లగార్తాను బోర్డు డైరెక్టర్లు ఎన్నుకున్నారు. బోర్డుకు కూడా ఆయన ఎన్నికైనట్లు కంపెనీ ఆ ప్రకటనలో వెల్లడించింది.

3. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వెళుతున్న ఎల్‌వీఆర్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద డివైడర్‌ను ఢీకొంది. దీంతో వెనుక వస్తున్న మరో రెండు బస్సులు, ఓ కారు కూడా వీటిని ఢీకొన్నాయి. ప్రమాదంలో విశాఖపట్టణానికి చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు(రెండో డ్రైవర్‌) మృతి చెందారు. అన్ని వాహనాల్లో కలిపి 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వీరిలో కొందరిని విజయవాడ, హైదరాబాద్‌ తరలించారు.

4. జమ్ము-కశ్మీర్‌ పౌరులకు ప్రత్యేక హక్కులు, విశేష అధికారాలు కల్పించే 35ఏ అధికరణం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలా? వద్దా? అన్నది నిర్ణయించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ వాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్వీకరించింది. సోమవారం జస్టిస్‌ చంద్రచూడ్‌ హాజరుకాకపోవడంతో విచారణ చేపట్టలేదు. అయిదుగురు సభ్యులుగల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలా? వద్దా? అనే విషయాన్ని తొలుత పరిశీలిస్తామని తెలిపింది.

5. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్ర కలకలం రేగింది. 2016లో నమోదైన ఐసిస్‌ కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) అధికారులు సోమవారం రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. రాబోయే రెండు రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని పలువురు అనుమానితులకు నోటీసులు జారీచేశారు. సోదాల సందర్భంగా ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో విధ్వంసానికి కుట్రపన్నిన ఘటనకు సంబంధించి 2016లో ఏడుగురు యువకులను ఎన్‌.ఐ.ఎ. అధికారులు అరెస్టు చేసిన తర్వాత మళ్లీ ఉగ్రకలకలం రేగడం ఇదే ప్రథమం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణలో ఉద్యోగుల కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) గడువును వచ్చే నవంబరు వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గడువులోగా నివేదిక సమర్పించే పరిస్థితి లేకపోవడంతో పొడిగింపు అనివార్యంగా మారింది. దీనిపై పీఆర్‌సీ, ఆర్థికశాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

7. వాయువ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇది సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనంతో కలిసి ఉందని వివరించారు. ఇది నైరుతి దిశగా కదులుతున్నట్లు సంకేతాలందుతున్నాయని తెలిపారు. ఈ అల్పపీడనం మంగళవారంలోపు మరింత బలపడే అవకాశం కనిపిస్తోందన్నారు. మరోపక్క దక్షిణ ఒడిశా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం.. రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా పలుచోట్ల ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

8. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుకమా జిల్లాలోని దట్టమైన అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 15 మంది నక్సల్స్‌ చనిపోయారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ అని, ఒకే ఘటనలో ఇంత మంది నక్సల్స్‌ మృతదేహాలు లభ్యం కావడం ఇది మొదటిసారని ప్రత్యేక డీజీపీ డి.ఎం.అవస్థి విలేకరులతో పేర్కొన్నారు. ఈ ఘటనలో ఒక మహిళ సహా ఇద్దరు నక్సల్స్‌ గాయపడ్డారు.

9. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం సోమవారం మళ్లీ విషమించింది. గత నెలలో కరుణ తీవ్ర అస్వస్థతకు గురవడంతో చెన్నై ఆళ్వార్‌పేటలోని కావేరి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌ తొలిసారిగా సోమవారం ఆస్పత్రికి చేరుకోవడం, ఇతర కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా ఆస్పత్రికి వస్తుండటంతో డీఎంకే నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. దీంతో భారీ సంఖ్యలో ఆస్పత్రికి కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.

10. బెంగళూరులో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం 210 ఎకరాల భూములను కేటాయించిన కేంద్ర రక్షణశాఖ తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని రెండు ముఖ్యమైన ఆకాశ మార్గాల నిర్మాణానికి రెండేళ్లుగా అనుమతించడం లేదని రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అలాంటి కరుణ, విధానాలను తమ రాష్ట్రానికి ఎందుకు వర్తింపజేయడం లేదని ఆయన కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ను ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

Related posts

Leave a Comment