జోడీ కుదిరేనా..? కమల్‌, రజనీ కలిసి పనిచేయాలి: విశాల్‌

వెండితెరపై అగ్రనటులుగా వెలుగొందుతున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, లోకనాయకుడు కమల్‌హాసన్‌ ఏకకాలంలో రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇద్దరి దారులు వేరైనా లక్ష్యం ఒకటే అన్నట్లు కొనసాగుతున్నారు. ఈ క్రమంలో రాజకీయంగా కమల్‌హాసన్‌ ఒకడుగు ముందున్నారు. పార్టీ ప్రారంభం, సుదీర్ఘ ప్రణాళికతో దూసుకెళుతున్నారు. పార్టీ ప్రారంభానికి ముందే రజనీ మక్కల్‌ మండ్రం ద్వారా కోటిన్నర మంది సభ్యులను చేర్చుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో సినిమాలు, రాజకీయపరంగా విమర్శలు ఆయనకు తప్పడంలేదు. ఇన్ని జరుగుతున్నా పార్టీ ప్రారంభంపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. నవంబరు, జనవరి అని… వినిపిస్తున్నా వాటిపై రజనీకాంత్‌ ఇంకా స్పందించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కమల్‌, రజనీ ఇద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని, వారు యువతరానికి స్ఫూర్తిగా నిలవడమేకాకుండా మంచి ఫలితాలు రాబట్టబవచ్చని తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ అభిప్రాయపడ్డారు. వారికి సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి జయకుమార్‌… వారిద్దరూ ఏకమై వచ్చినా రాష్ట్రంలో రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవని వ్యాఖ్యానించారు. అదే సమయంలో కరవు తప్పదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రజనీకాంత్‌పైనే దృష్టి నిలిపాయి. ఆయన వేసే ప్రతి అడుగును క్షుణ్నంగా గమనిస్తున్నాయి. ఒక విధంగా వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని పనిచేయనున్నాయనే సంకేతాలు వస్తున్నాయి.
బలమైన నేత కోసం….
రాష్ట్ర రాజకీయాల్లో ఆది నుంచి సినీ ప్రభావం ఎక్కువ. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ రాకతో మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. వారు ఏ మేరకు రాణిస్తారో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బలమైన నేత కోసం చూస్తున్న రాష్ట్ర ప్రజలు… ఇప్పటికే ఉన్న వారిపై ఒక అభిప్రాయానికి వచ్చేశారు. రజనీకాంత్‌పై ఒక వర్గం ప్రజలు, ఆయన అభిమానులు ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందుకే రజనీ మక్కల్‌ మండ్రం సభ్యత్వ నమోదు కూడా ఆ స్థాయిలో జరుగుతోంది. కమల్‌హాసన్‌ కూడా తన ప్రత్యేకతతో ప్రజల మనసు గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నుంచి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎంకే స్టాలిన్‌ కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటడానికి చూస్తున్నారు. ఈ క్రమంలోనే విశాల్‌ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అందివచ్చిన అవకాశంగా…
అన్నాడీఎంకే, డీఎంకేలు రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం వంతులవారీగా పాలన సాగిస్తున్నాయి. జయలలిత మరణించడం, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఇంటికే పరిమితం అవడం కొత్తవారికి అవకాశంగా మారింది. భాజపా, కాంగ్రెస్‌ ఏదోవిధంగా రాష్ట్రంలో పాగా వేయాలని తహతహలాడుతున్నాయి. అగ్రనటులు రజనీ, కమల్‌ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగారు. యుద్ధం అంటూ వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అభిమానులకు పిలుపు ఇచ్చిన రజనీకాంత్‌ పార్టీ ప్రారంభ పనుల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒక వైపు దుమారం రేగుతోంది. సినిమాల విషయంలో అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు ఆయన భార్య లతకు రుణ చెల్లింపు వ్యవహారంలో చిక్కులు ఎదురవుతున్నాయి. కమల్‌హాసన్‌ కూడా ప్రభుత్వ అవినీతిపై గళమెత్తి ఏకంగా పార్టీ ప్రారంభించారు. ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు బుల్లితెర, వెండితెరపై అభిమానులను అలరించేలా ప్రణాళికలు రచించుకున్నారు. ఇటీవల ఆయన చేసిన కుల వ్యాఖ్యలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. వీటన్నింటినీ దాటుకొని అగ్ర నటులిద్దరు కలిసి సత్తా చాటుతారా? లేదా? అనే విషయం తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Related posts

Leave a Comment