జులై 5.. వచ్చేస్తోంది

ఎల్లుండి నుంచి క్రిప్టోకరెన్సీల లావాదేవీలకు బ్యాంకులు దూరం!
ఆర్‌బీఐ నిర్ణయానికి సుప్రీంకోర్టు పచ్చజెండా
ఆంక్షలపై వాయిదాకు తిరస్కరణ
బిట్‌కాయిన్‌లో పెట్టుబడులుంటే వదిలించుకోండి బిట్‌కాయిన్‌.. గతేడాది చివర్లో ఇది సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లి ప్రపంచవ్యాప్త ట్రేడర్లను, మదుపర్ల దృష్టిని ఆకర్షించింది. దీని జోరు చూసి కొన్ని దేశాలైతే హడలెత్తిపోయాయి కూడా. తమ అధికారిక కరెన్సీలకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందేమోనని భయాందోళనకూ లోనయ్యాయి. ఎప్పుడైతే ఆయా దేశాల నియంత్రణ సంస్థలు, సెంట్రల్‌ బ్యాంకులు రంగంలోకి దిగాయో.. ఇక అక్కడ నుంచి బిట్‌కాయిన్‌ పరుగుకు అడ్డుకట్టపడింది. క్రమక్రమంగా క్షీణత బాట పట్టింది. మన ఆర్‌బీఐ ఇంకాస్త కఠినంగా వ్యవహరించి బిట్‌కాయిన్‌తో సహా ఇతర ఏ క్రిప్టోకరెన్సీలకు లావాదేవీల సేవలను అందించవద్దని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు ఆంక్షలు విధించింది. ఇందుకు 3 నెలల సమయం ఇచ్చింది. ఆ గడువు రేపటితో ముగియనుంది. సుప్రీంకోర్టు కూడా ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడంతో ఎల్లుండి నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రావచ్చు.
బిట్‌ కాయిన్‌ లేదా ఇతర ఏ క్రిప్టో కరెన్సీల్లో (ఊహాజనిత కరెన్సీ)నైనా మీకు పెట్టుబడులు ఉన్నాయా? అయితే వెంటనే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకొని బయటకు వచ్చేయడం మేలు. ఎందుకంటే ఎల్లుండి నుంచి బిట్‌కాయిన్‌ లావాదేవీల సేవలను బ్యాంకులతో పాటు ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న ఏ ఆర్థిక సంస్థ కూడా నిర్వహించకపోవచ్చు.. గతేడాది ఆఖర్లో బిట్‌కాయిన్‌ అనూహ్యంగా పెరగడంతో ఈ ప్రమాదకరమైన పెట్టుబడి విధానానికి మదుపర్లు ఆకర్షితులవ్వకుండా కొన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంకులు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. మనదేశంలో కూడా బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలను నిలిపేయాలని ఎక్స్ఛేంజీలకు, సంస్థలకు ఆర్‌బీఐ, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేశాయి. ఈ తరహా లావాదేవీలకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సేవలు అందించవద్దని ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. ఇందుకు జులై 5వ తేదీని గడువుగా పేర్కొంటూ ఏప్రిల్‌లో ఓ సర్క్యులర్‌ను కూడా జారీ చేసింది కూడా. అయితే ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ద ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) సుప్రీంకోర్టులో ఓ పిటీషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆర్‌బీఐ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. ఆర్‌బీఐ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ప్రకారం చూస్తే ఎల్లుండి నుంచి క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల లావాదేవీలకు బ్యాంకులు సేవలు నిలిపివేసే అవకాశం ఉంది. అంతేకాదు.. బిట్‌కాయిన్‌లో పెట్టిన పెట్టుబడులను తిరిగి నగదుగా మార్చుకునే వీలు కూడా ఉండకపోవచ్చు.
ప్రత్యామ్నాయం వైపు చూపు..
సాధారణంగా ఎక్స్ఛేంజీల ట్రేడింగ్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మార్గంలోనే జరుగుతుంటాయి. ప్రతి ట్రేడింగ్‌ లావాదేవీకి కొంత రుసుమును ఎక్స్ఛేంజీలు వసూలు చేస్తుంటాయి. ఇప్పుడు బిట్‌కాయిన్‌ లావాదేవీలకు సేవలు అందించడంపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించడంతో ఎక్స్ఛేంజీలు, సంస్థలు ప్రత్నామ్నాయ బాట పట్టేందుకు యోచిస్తున్నాయి. కొనుగోలుదారు, విక్రయదారులే నేరుగా పరస్పరం లావాదేవీలు నిర్వహించుకునేలా పీటూపీ (పీర్‌ టూ పీర్‌) ట్రేడింగ్‌ను ఎక్స్ఛేంజీలు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలు జరిగే సమయంలో ఎలాంటి మోసాలు చోటుచేసుకోకుండా ఎక్స్ఛేంజీలు మధ్యవర్తిత్వ ఖాతాగా వ్యవహరిస్తాయి.

Related posts

Leave a Comment