జావా గుర్తుందా? మళ్లీ వస్తోంది..

1960ల నాటి జావా బైక్‌ గుర్తుందా.. ముందుగా యూరప్‌లో రూపుదిద్దుకొని.. క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తూ 60వ దశకంలో ఇండియా చేరుకుంది. ఐడియల్‌ జావా పేరుతో భారత్‌లో అడుగుపెట్టిన ఈ బైక్‌ నాటి రోజుల్లోనే పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. రేసర్ల కోసమే ప్రత్యేకంగా తయారుచేసినట్లు ఎంతో స్టైలిష్‌గా.. మరెంతో వైవిధ్యంగా ఆ రోజుల్లో భారత్‌ మోటార్‌సైకిల్‌ మార్కెట్‌ను ఓ ఊపు ఊపింది. 1973లో ఎజ్దీగా పేరు మార్చుకొని ఎ, బి, సి, డి అంటూ వరుస ఇంజిన్‌ మోడళ్లతో ఓ వెలుగు వెలిగింది. అయితే 1980ల్లో అప్పుడే మార్కెట్‌లోకి యమహా, హోండా రావడంతో ఒక్కసారిగా జావా(ఎజ్దీ) కు అంతగా వినియోగదారులను ఆకర్షించలేకపోయింది. మొత్తంగా 1996నుంచి దీని అమ్మకాలు క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఇదంతా నాటి కథ. ఎందుకంటే చాలా కాలంగా దీనిని మళ్లీ మార్కెట్‌లోకి తీసుకరావాలనుకున్న మహీంద్ర&మహీంద్ర కంపెనీ కలలు త్వరలోనే నిజం కానున్నాయి.

అధునాతన మార్పులతో ముఖ్యంగా 300సీసీ ఇంజిన్‌ సామర్థ్యంతో మార్కెట్‌లోకి కొత్త జావా బైక్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2018 దీపావళిలోగా మార్కెట్‌లోకి కొత్త రకం జావా బ్రాండెడ్‌ బైక్‌ను తీసుకు రానున్నట్లు ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతానికి వీటి అభివృద్ధికి సంబంధించిన ప్రక్రియ మధ్యప్రదేశ్‌లోని పితాంపూర్‌లో కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. భారత్‌, ఆగ్నేయాసియా దేశాల్లో వీటి అమ్మకపు హక్కులు సైతం దక్కించుకున్నట్లు ఆయన చెప్పారు.

ప్రస్తుతం మహీంద్రా అందిస్తున్న మోజో(మోజో యూటీ300, మోజో ఎక్స్‌టీ300) బైక్‌లలో ఉపయోగిస్తున్న 300సీసీ ఇంజిన్‌నే ఆధారంగా చేసుకొని జావా బైక్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. మహీంద్రా&మహీంద్రా కంపెనీ రూపొందిస్తున్న ఈ బైక్‌లో ఇంజిన్‌ సామర్థ్యాన్ని 250సీసీకి తగ్గించడంగానీ, 350సీసీకి పెంచడంగానీ, లేదా ఇంతకుముందు జావా బైక్‌లో ఉన్న ఇంజిన్‌నే కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా ఇంతకుముందు మహీంద్రా అందుబాటులోకి తెచ్చిన మోజో సిరీస్‌కు ఆశించినంత స్థాయిలో ఆదరణ దక్కలేదు. కానీ ఇంజిన్ మాత్రం ఉపయుక్తంగా మారింది. దీని ఆధారంగా నూతన మోడల్స్‌ను రూపొందించే విధంగా ఉంది. ముఖ్యంగా మోజో ఎక్స్‌టీ300 ఇంజిన్‌ అన్ని రకాలుగా తోడ్పాటునందిస్తుందని తేలడంతో ఇదే ఇంజిన్‌ను నూతన జావా బైక్‌లలోనూ కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

మోటార్‌సైకిల్‌ విభాగంలోనే ఈ నూతన జావా సిరీస్‌ బైక్‌లు అత్యుత్తమ ఇంజిన్‌ సామర్థ్యంతో ఈ ఏడాది చివరిలోగా అందుబాటులోకి వస్తాయని.. వీటి ధర సైతం 2-3లక్షల వరకు ఉంటుందని మహీంద్రా గ్రూప్‌ సూచనాప్రాయంగా వెల్లడించింది.

Related posts

Leave a Comment