జాతిపిత జీవితం ఆదర్శం

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మంగళవారం జాతిపితకు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. మహాత్ముడి జీవితం ఆదర్శనీయమని, ఆయన చూపిన మార్గం ఆచరణీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో జరిగిన సర్వమత ప్రార్థనల్లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తదితరులు పాల్గొన్నారు. గాంధీ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించారు. ధ్యాన మందిరంలో నివాళులర్పించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో బాపూఘాట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ తర్వాత వచ్చిన గవర్నర్‌కు సాదరంగా స్వాగతం పలికారు. సమాచారశాఖ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. రాంకోఠి ప్రభుత్వ సంగీత నృత్యకళాశాల బృందం భజన గీతాలను ఆలపించింది.
కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, జీఏడీ ప్రొటోకాల్ కార్యదర్శి అధర్‌సిన్హా, ఇంటెలిజెన్స్ ఐజీ ఎంకే సింగ్, పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో రామరాజ్యం: మధుసూదనాచారి
రాష్ట్రంలో గాంధీ కలలుగన్న రామరాజ్యం నడుస్తున్నదని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి ఆయన శాసనసభ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీ ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మంచి పరిపాలనను అందిస్తున్నారని, రామరాజ్యాన్ని గుర్తు తెస్తున్నారని తెలిపారు.
అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీచైర్మన్ నేతి విద్యాసాగర్, స్పీకర్ మధుసూదనాచారి, చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు బీ వెంకటేశ్వర్లు, భూపాల్‌రెడ్డి, పూల రవీందర్, సుధాకర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు

Related posts

Leave a Comment