జనసేన అలాంటి యుద్ధమే చేస్తోంది!: పవన్‌కల్యాణ్‌

‘ఒక విత్తు మొక్కగా మారి, చెట్టు కావడానికి ఎన్నో కష్టాలు పడాలి. అందుకు ఎంతో యుద్ధం చేయాలి. ఇప్పుడు జనసేన పార్టీ కూడా అలాంటి యుద్ధమే చేస్తోంది’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. సోమవారం అఖిల భారత చిరంజీవి యువతతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘జనసేన పార్టీ బయట వారిది కాదు. చిరంజీవి అభిమానులదే. ఎందుకంటే నేనూ చిరు అభిమానినే కాబట్టి. ఈ పార్టీ కూడా మీదే. నాకు చిరంజీవి ఒక్కడే హీరో. అందుకే పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అని నేను ప్రత్యేకంగా ఏదీ పెట్టలేదు. ఆయన సినిమాల్లోకి రాకముందు నుంచే ఆయన నా హీరో. నేను ఎప్పటికీ ఆయన అభిమానినే. చిరు మీద మాట పడితే ఊరుకునేవాడిని కాదు. ‘విజేత’ సినిమా సమయంలో ‘నువ్వు ఏమవుదామనుకుంటున్నావ్‌’ అని అన్నయ్య అడిగితే ‘నీకు సెక్యురిటీ గార్డుగా ఉందామనుకుంటున్నా. నాకు అంతకుమించి కోరికలు లేవు’ అని చెప్పా. ఇప్పటికీ ఆయనపై అదే గౌరవం, అదే ప్రేమ ఉన్నాయి. ప్రజారాజ్యం సమయంలో కూడా నేను ఒక నాయకుడిగా మాత్రమే పనిచేస్తానని చెప్పా. ప్రజా సమస్యలను పట్టించుకునేవారు లేకపోవడంతోనే నేను ఈ రోజు జనసేన పార్టీని స్థాపించాల్సి వచ్చింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు బాధ్యత కూడిన రాజకీయ పార్టీలు కావాలి. ప్రజల మధ్య సామరస్యం పెంచే విధంగా అవి ఉండాలి. అంతర్గత విభేదాలు ఉంటే చిరంజీవి అభిమానులు వాటిని విడిచిపెట్టాలి.’’

‘‘ప్రస్తుత పరిస్థితులు చాలా సవాల్‌తో కూడుకున్నవి. మార్పు వచ్చేటప్పుడు కష్టం ఉంటుంది. ప్రస్తుతం జనసేన అలాంటి యుద్ధమే చేస్తోంది. యుద్ధమంటే కత్తులతోనూ, కటారులతోనూ కాదు. భావజాలంతో యుద్ధం. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, దానికి ఒక భావజాలం ఉండాలి. అది కేవలం అధికారం కోసం కాకూడదు. ప్రజలకు మీరు ఏం చేయగలరు? యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పించగలరు? రైతులను ఎలా నిలబెట్టగలరు? మహిళలకు అభ్యున్నతికి ఏం చేయగలరు. ఈ భావజాలంతో మేము పుస్తకం రాశాం. అందరికీ అర్థమయ్యేలా ఏడు సూత్రాలతో వివరించాం. ఈరోజున ఇంతమంది ప్రేమాభిమానాలతో జనసేనలో చేరినందుకు ధన్యవాదాలు’’ అని అన్నారు. ఈ ఆత్మీయ సదస్సుకు పెద్దసంఖ్యలో అభిమానులు తరలిరావడంతో సభా వేదికపై కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

Related posts

Leave a Comment