‘జనసేన’లోకి ”రేపల్లె’ మాజీ ఎమ్మెల్యే ‘దేవినేని మల్లిఖార్జునరావు’….!

ఆయన ఒకప్పుడు ఆ ప్రాంతంలో తిరుగులేని నేత. ఒకటి రెండు నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగిన వారు. తన సామాజికవర్గంలో గట్టి పట్టున్న ఆయన…కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన ఆడిందే ఆట..పాటిందే పాట అన్నట్లు నడిచింది. రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత…రాష్ట్ర విభజనతో ఒక్కసారిగా ఆయన రాజకీయ భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్‌ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే…ఆయనకు ఆ పార్టీ నుంచి ఆశించిన ఆదరణ దక్కలేదు..సరి కదా పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో మళ్లీ పట్టుసాధించాలంటే ఏమి చేయాలనేదానిపై ఆయన తన సన్నిహితులతో కసరత్తులు చేస్తున్నారు. ఇంతకీ…ఆయన ఎవరనుకుంటున్నారా..? ఆయనే ‘రేపల్లె’ మాజీ ఎమ్మెల్యే ‘దేవినేని మల్లిఖార్జునరావు’.

2004 అసెంబ్లీ ఎన్నికల్లో ‘రేపల్లె’ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ‘దేవినేని’ ఈ ప్రాంతంలో పట్టుసాధించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా, వై.ఎస్‌ అనుచరునిగా ఆయన ఇక్కడ తనదైన శైలిలో రాజకీయాలను నిర్వహించారు. ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన ‘దేవినేని’కి 2009లో ‘వై.ఎస్‌’ సీటు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అన్కమనస్కంగానే పార్టీలో కొనసాగిన ‘దేవినేని’ రాష్ట్ర విభజన తరువాత టిడిపిలో చేరారు. అప్పట్లో టిడిపి తనకు టిక్కెట్‌ ఇస్తుందని భావించిన ఆయన అందరి కన్నా ముందే పార్టీలో చేరినా…బిసి సామాజికవర్గానికి చెరదిన ‘అనగాని సత్యప్రసాద్‌కు’ టిక్కెట్‌ దక్కింది. తనకు టిక్కెట్‌ దక్కకపోయినా..’దేవినేని’ ‘అనగాని’ గెలుపు కోసం కృషిచేశారు. అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత ‘దేవినేని’ని పట్టించుకునే నాధుడే లేడు. ఆయనను పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించకుండా అవమానించారు. అదే సమయంలో ఎమ్మెల్యే అనగాని ఆయనను దూరం పెట్టి..నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో టిడిపిలో ఉంటే…తనకు ప్రాధాన్యత ఇవ్వరని..ఇప్పుడు అటో…ఇటో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని..ఆయన సన్నిహితులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారట. దీంతో…ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లాలనే దానిపై ఆయన ఆలోచన చేస్తున్నారు. వైకాపాలోకి వెళదామంటే.. అక్కడ సీటు వచ్చే పరిస్థితి లేదు. ఆ పార్టీ తరుపున మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మళ్లీ పోటీ చేయడం ఖాయం కావడంతో…ఇక ‘జనసేన’లో అయినా సీటు సాధించాలని ‘మల్లిఖార్జునరావు’ అనుకుంటున్నారట. దీంతో..ఆ పార్టీ నాయకులతో చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్నారని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకులు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా…’దేవినేని’ వంటి బలమైన నాయకుడ్ని వదులుకుంటే టిడిపికే నష్టం జరుగుతుందని పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు అంటున్నారు. మరి చూద్దాం..ఏమి జరుగుతుందో..!?

Related posts

Leave a Comment