జనసేనది పాతికేళ్ల ప్రణాళిక రెండు కోట్ల మంది భాగస్వాములయ్యారు..

‘రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు.. పాతికేళ్ల ప్రణాళికతో జనసేన పార్టీ ప్రజల్లోకి వచ్చింది..’ అని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రశాంత్‌హిల్స్‌లో పార్టీ ఐటీకేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..సామాజిక, రాజకీయ బాధ్యతతో కూడిన వ్యవస్థను నిర్మించేందుకు పార్టీని ఏర్పాటుచేశామన్నారు. సమస్యల్లో ఉన్నవారు, సమాజంలో నిరాదరణకు గురైనవారి కోసం పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఇప్పటికే పార్టీతో రెండు కోట్లమంది భాగస్వాములయ్యారని చెప్పారు. రెండులక్షల మంది పార్టీలో సభ్యత్వం కోసం తమ చరవాణికి మిస్డ్‌కాల్‌ ఇచ్చారన్నారు. సాంకేతికతను వినియోగించుకోవడంలో ప్రాంతీయ పార్టీల్లో జనసేన ముందుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ అన్నారు. ఐటీకేంద్రం ద్వారా ప్రజలు, కార్యకర్తలతో నిత్యం అనుసంధానమై ఉంటామన్నారు. అధినేత సందేశాలను ప్రజలవద్దకు తీసుకెళ్లడం, ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌లతో మాట్లాడటంతో పాటు కాల్‌సెంటర్‌ ద్వారా సభ్యత్వ నమోదు, నిత్యం సభ్యులతో సమాచార లావాదేవీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్విటర్‌లో 32లక్షల మంది, ఫేస్‌బుక్‌లో 16లక్షల మంది పవన్‌కల్యాణ్‌ను అనుసరిస్తున్నారని తెలిపారు.

Related posts

Leave a Comment