జగన్‌లా నేనూ తిట్టగలను.. కానీ

భీమవరం: సామాజిక, రాజకీయ వ్యవస్థను మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్టులు రాజ్యమేలుతారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. స్వార్థం లేని వారే రాజకీయాల్లో ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాలు చేయాలంటే పెట్టి పుట్టనక్కర్లేదని.. ధైర్యం, తెగింపు ఉంటే చాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌.. ఈరోజు భీమవరంలోని డీఎన్‌ఆర్‌ కళాశాల విద్యార్థులు, భీమవరం, ఉంగటూరు, ఉండి నియోజకవర్గాల జన సైనికులతో విడివిడిగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లని గాంధీ అన్నారని.. కానీ నేడు ఆడపిల్లలు పగలు కూడా రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉందన్నారు. 2019.. రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమని.. అందరూ తమ ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. తుపాకీతో కాల్చేసినోళ్లు, దోపిడీలు చేసి చట్టం నుంచి తప్పించుకున్న వాళ్లు ప్రజల మీద పెత్తనం చేస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. దోపిడీదారులు కోట్లు సంపాదిస్తుంటే.. పీజీ, పీహెచ్‌డీలు చేసిన విద్యావంతులు వాళ్ల కింద పనిచేస్తున్నారని.. ఇలాంటి వ్యవస్థ మారాలన్నారు.

తాను మంత్రి నారా లోకేశ్‌లా అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రాలేదని పవన్‌ అన్నారు. ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకు కోపం.. మాట్లాడకపోతే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తిట్టే పరిస్థితుల్లో వచ్చానని గుర్తుచేశారు. మంత్రి లోకేశ్‌.. ఏ పనికి ఎంతొస్తుంది అన్న స్వార్థంతో పాలసీలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌లా.. తాను బాగా తిట్టగలనని.. తనకూ పెద్ద నోరు ఉందన్నారు. కానీ ఒకరినొకరు తిట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావన్నారు. రాజకీయ నాయకులు చేసే పాలసీల వల్ల సామాన్యుడు ఇబ్బంది పడకూదని… అందుకే మరో పాతికేళ్లు తన జీవితాన్ని రాజకీయాలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు పవన్‌ తెలిపారు.

Related posts

Leave a Comment