‘చైతన్య కొత్త టాటూకు అర్థమిదేనా..?’

అభిమాని ప్రశ్నకు సమంత జవాబు ఏంటంటే?‌

టాలీవుడ్‌ క్రేజీ కపుల్స్‌లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. వీరిద్దరి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తి చూపుతుంటారు. చాలామంది వీరాభిమానులు తమ ప్రశ్నలను సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నిస్తుంటారు. సమంత అభిమానులపై ఇష్టంతో వాటికి తరచూ సమాధానాలు ఇస్తుంటారు. కాగా చైతన్య, సామ్‌ తమ చేతులపై ఒకే ఆకారంలో టాటూ వేయించున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు గతంలో వైరల్‌ అయ్యాయి.

అయితే చైతన్య రెండు రోజుల క్రితం తన తండ్రి నాగార్జున నటించిన ‘ఆఫీసర్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ఆయన ఫొటోలు క్లిక్‌ మనిపించింది. వీటిలో చైతన్య చేతికి ఉన్న టాటూకు కింది వైపుగా డాట్స్‌ కనిపించాయి. దీంతో చైతన్య కొత్త టాటూ వేసుకున్నారంటూ ఫొటోలు చక్కర్లు కొట్టడం మొదలైంది.

ఈ నేపథ్యంలో ఓ అభిమాని చైతన్య కొత్త టాటూకు అర్థం కనిపెట్టి, ట్వీట్‌ చేశారు. ‘చివరికి టాటూ అర్థం తెలుసుకున్నా. ఇది మోర్స్‌ కోడ్‌ (డాట్స్‌ రూపంలో రాసే భాష. గూఢచారులు ఎక్కువగా వాడుతుంటారు). దాని అర్థం 6-10-17.. ఇది చైసామ్ పెళ్లి రోజు. నేను తప్పుగా చెప్పి ఉంటే సరి చేయండి చైతన్య, సమంత’ అని ట్వీట్‌ చేశారు. దీనికి సమంత ప్రతి స్పందిస్తూ.. ‘వావ్‌ నీకు చాలా ఆతృతగా, ఆసక్తిగా ఉన్నట్లు ఉంది.. కదూ’ అని నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేశారు. మరి నిజంగా టాటూ అర్థం అదేనా అనే విషయాన్ని మాత్రం సమంత స్పష్టం చేయలేదు.

Related posts

Leave a Comment