చిచ్చు రేపుతున్న ఆరెస్సెస్

శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పు సాకుగా ఆరెస్సెస్, బీజేపీలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేరళ సీఎం పినరాయి విజయన్ ఆరోపించారు. కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసే ప్రసక్తే లేదన్నారు. తమ రాష్ట్ర ఐక్యతను, లౌకిక విధానాల ధ్వంసానికి కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని సోమవారం ఆయన మీడియాతో అన్నారు. తమ ప్రభుత్వం మత విశ్వాసాలను, ఆయా మతా ల ఆచారాలను, ప్రార్థనా స్థలాలను పరిరక్షిస్తుందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేవారికి లొంగే ప్రసక్తే లేదన్నారు. భక్తులతో పోట్లాడటం తమ ప్రభుత్వ విధానం కాదని, వారి ప్రయోజనాలను పరిరక్షిస్తామన్నారు. ఇటీవల సంభవించిన అసాధారణ వరద పరిస్థితిని సమైక్యంగా ఎదుర్కొన్న కేరళ వాసుల ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై అనుమానాలున్న వారితో చర్చించడానికి సిద్ధమన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాంగ్రెస్, బీజేపీలపై విజయన్ తీవ్రస్థాయిలో ఆగ్ర హం వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులతో చేతులు కలుపుతున్న కాంగ్రెస్ తనకు తానే పతనం అవుతుందన్నారు. తొలుత సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల తరువాత రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు.

బీజేపీవి ద్వంద్వ ప్రమాణాలు
ముంబైలోని హాజీ అలీ దర్గా, అహ్మద్‌నగర్‌లోని శని దేవాలయంలోకి మహిళలను అనుమతించాలన్న బొంబాయి హైకో ర్టు తీర్పును మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేసిందని, శబరిమల విషయంలో మాత్రం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నదని విజయన్ విమర్శించారు. పాత రోజుల్లో రుతుస్రావంలో ఉన్న స్త్రీలను అపవిత్రులుగా భావించి ఇండ్ల బయట ఉంచేవారని, వారిని వంటగదిలోకి అనుమతించేవారు కాదని గుర్తు చేశారు. కాలక్రమంలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని చెప్పారు.

మత విశ్వాసాలకే మా మద్దతు: చెన్నితల
మత విశ్వాసాలకే తమ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల పేర్కొన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఆందోళనలను చేపడుతున్నాయని విమర్శించారు. కేరళ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పండళం నుంచి తిరువనంతపురం వరకు ఈ నెల 10నుంచి ఐదురోజుల పాటు శబరిమల పరిరక్షణ యాత్రను నిర్వహించనున్నామని బీజేపీ ప్రకటించింది.

శైలజా విజయన్ రివ్యూ పిటిషన్
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరుతూ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షురాలు శైలజా విజయన్ సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు తీర్పు అంగీకారయోగ్యం కాదని, నిర్హేతుకమైనదన్నారు. ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఎటువంటి తీర్పైనా ప్రజా వాణి ముందు సరిపోలలేదు అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికి చెందిన గౌరీ లక్ష్మీ బాయి మొదటిసారిగా ఈ అంశంపై స్పందించారు. శబరిమల ఆలయం విషయమై జరుగుతున్న పరిణామాలు బాధాకరమని, శతాబ్దాల పురాతనమైన సంప్రదాయాలను ఉల్లంఘిస్తున్నారని ఆమె ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
Tags: Pinarayi Vijayan , Sabarimala , Deliberate , Unity

Related posts

Leave a Comment