గెలిచిన ఇమ్రాన్‌.. కానీ పొత్తు తప్పదు

మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోని పీటీఐ

పాకిస్థాన్‌ జాతీయ ఎన్నికల్లో మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ విజయం సాధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. విడుదలైన ఫలితాల ప్రకారం పీటీఐ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఉదయం పాకిస్థాన్‌ ఎన్నికల కమిషన్‌ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. పీటీఐ పార్టీ 110 స్థానాల్లో విజయం సాధించింది. 272 స్థానాల్లో ఎన్నికలు జరగగా 251 చోట్ల ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా చోట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌ఎన్‌ పార్టీ 63 స్థానాల్లో గెలుపొందింది. బిలావల్‌ బుట్టో ఆధ్వర్యంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ 42సీట్లు దక్కించుకుంది. 21 చోట్ల ఇంకా ఫలితాలు వెల్లడికాలేదు. వీటిలో కొన్ని స్థానాల్లో పీటీఐ ముందంజలో ఉంది. అయినప్పటికీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 137 మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోలేదు. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఖాన్‌కు మద్దతిచ్చే పలు చిన్న పార్టీలు ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు. పాక్‌ స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ దూసుకెళ్తోంది.

పీఎంఎల్‌ఎన్‌ పార్టీ బలమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుందని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షాబాజ్‌ షరీఫ్ వెల్లడించారు. పాక్‌లో అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ గురువారం రాత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని పీఎంఎల్‌ఎన్‌ ఆరోపిస్తుండగా, ఆ ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తానని ఖాన్‌ వెల్లడించారు. భారత్, అఫ్ఘానిస్థాన్‌ల‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. పరస్పర లాభం ఉండేలా అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

Tags: pakistan, latest political, updates 2019,imran khan,pti party president

Related posts

Leave a Comment