గుహ నుంచి సురక్షితంగా మరో నలుగురు

థాయిలాండ్‌ గుహలో మిగిలిపోయిన చిన్నారులకు తొడిగి, వారిని నీటిలోంచి లాక్కుంటూ క్షేమంగా తీసుకొచ్చేందుకు అమెరికాలో సోమవారం యుద్ధప్రాతిపదికన తయారుచేసిన గాలి బుడగ. వీటి పనితీరును కాలిఫోర్నియాలో పరీక్షించారు
థాయ్‌లాండ్‌లోని తామ్‌ లుయాంగ్‌ గుహ నుంచి బాలలను రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం మరో నలుగుర్ని బయటకు తీసుకువచ్చారు. ఇందులో ఒకర్ని వైద్యులు స్ట్రెచర్‌ పైనుంచి అంబులెన్స్‌లోకి ఎక్కించారు. అతడెవరో మీడియా కంటబడకుండా ఉండటానికి తెల్లటి గొడుగులను అడ్డుగా ఉంచారు. నలుగురి వివరాలను అధికారులు వెల్లడించలేదు. మరోవైపు ఆదివారం గుహ నుంచి తొలిసారిగా ఆరుగుర్ని క్షేమంగా బయటకు తీసుకొచ్చినట్లు తొలుత వార్తలు వచ్చాయి. చివరకు వారు నలుగురేనని తేలింది. సోమవారానికి మొత్తం 13 మందిలో ఎనిమిది మంది క్షేమంగా బయటపడినట్లైంది. కోచ్‌తో పాటు మరో నలుగుర్ని ఇంకా రక్షించాల్సి ఉంది. బుధవారం వీరిని రక్షిస్తారని భావిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి భారీగా వర్షాలు కురిసినా గుహలో నీటిమట్టం పెరగకుండా ఉండటానికి ప్రతిక్షణం భారీ పంపులతో బయటకు నీటిని తోడేస్తున్నారు. థాయ్‌లాండ్‌ ప్రధాని ప్రయుత్‌ చాన్‌ఓచా సంఘటన స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

వర్షం వస్తుందని భయంగా ఉంది: నరోంగ్‌సక్‌
సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించిన ఆపరేషన్‌ రెండోదశ సాయంత్రం 9 గంటలకు పూర్తి అయిందని చియాంగ్‌రాయ్‌ గవర్నరు నరోంగ్‌సక్‌ ఒసొట్టానకోర్న్‌ తెలిపారు. వాతావరణం అనుకూలించగానే మిగిలినవార్ని రక్షించడానికి మూడోదశ ఆపరేషన్‌ ప్రారంభిస్తామన్నారు. ఆదివారం వలె సోమవారం కూడా పరిస్థితులన్నీ అనుకూలించాయన్నారు. ‘బాలలు ధైర్యంగా ఉన్నారు. ఆదివారం ప్రణాళిక ప్రకారం వ్యవహరించినట్లే రెండోరోజూ ముందుకు సాగాం. వర్షం వస్తుందని భయంగా ఉంది. వీలైనంత త్వరగా పని ముగించాలి’ అని పేర్కొన్నారు.

ఆకలిగా ఉందన్న ఆసుపత్రిలోని బాలలు
ఆదివారం బయటపడిన నలుగురు బాలలూ ఆరోగ్యంగానే ఉన్నారని నరోంగ్‌సక్‌ ప్రకటించారు. ఆకలిగా ఉందని, తినడానికి ‘ఖావో పాడ్‌ గ్రాపావ్‌’ పెట్టాలని కోరినట్లు నరోంగ్‌సక్‌ తెలిపారు. మాంసాన్ని పచ్చిమిర్చి, తులసిదళాలతో ఫ్రై చేసి, అన్నంపై వడ్డించే స్థానిక వంటకమని విలేకరులకు వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఎలాంటి వ్యాధులు సంక్రమించకుండా చూసేందుకు వారి కుటుంబసభ్యులను కలవనీయడం లేదన్నారు. ఐదుగురు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, మరో 30 మందిని అత్యవసర పరిస్థితి ఎదురైతే సేవలందించడానికి వీలుగా సిద్ధంగా ఉంచామని తెలిపారు. తల్లిదండ్రులను సైతం కలవనీయడం లేదని వస్తున్న విమర్శలపై స్పందించారు. ఎవర్ని తీసుకొచ్చామో తెలిస్తే, గుహ లోపల ఉన్న బాలల కుటుంబసభ్యులు ఆందోళన పడే అవకాశం ఉందన్నారు. వైద్యులు అంగీకరిస్తే, అద్దాల నుంచి వారి తల్లిదండ్రులను మాత్రమే చూసే అవకాశం కల్పిస్తామన్నారు.
కొత్త ఆక్సిజన్‌ సిలిండర్ల ఏర్పాటు
ఆదివారం బాలల్ని తీసుకొచ్చిన నిపుణులే సోమవారం కూడా మళ్లీ వెళ్లారని థాయ్‌లాండ్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి అనుపోంగ్‌ పావోజిందా తెలిపారు. గుహలో ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారికే పూర్తి అవగాహన ఉందని మళ్లీ వారినే పంపించామన్నారు. వారిని తీసుకొచ్చే మార్గంలో అంతకుముందు పెట్టిన ఆక్సిజన్‌ సిలిండర్లు నిండుకున్నాయని, కొత్తవి ఏర్పాటు చేస్తున్నామన్నారు. 13 మందినీ వెలికితీయడానికి నాలుగురోజులు పడుతుందని అంతకుముందు అంచనా వేశామని, ఆదివారం పరిస్థితులను బట్టి చూస్తే ముందే పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. 13 మంది విదేశీ, ఐదుగురు థాయ్‌ సీల్స్‌ ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. థాయ్‌లాండ్‌కు చెందిన 40 మంది, విదేశాలకు చెందిన మరో 50 మంది వెరసి మొత్తం 90 మంది నిపుణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారన్నారు.

Related posts

Leave a Comment