‘గీత గోవిందం’ టీజర్‌ చూశారా!

హైదరాబాద్‌: ‘నేను మారిపోయా.. ఇప్పుడు నేను పూర్తిగా వేరు’ అంటున్నారు కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన నటిస్తున్న సినిమా ‘గీత గోవిందం’. రష్మిక కథానాయిక. పరుశురాం దర్శకుడు. గోపీ సుందర్‌ బాణీలు అందిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో గోవింద్‌గా విజయ్‌, గీతగా రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. సరదాగా రూపొందించిన ఈ టీజర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

‘ఆకాశవాణి.. విశాఖపట్నం కేంద్రం.. ఆశానిరాశ కార్యక్రమంలో ముందుగా గీత గోవిందం కోరిక మేరకు..’ అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ పాటను వినిపించారు. గీతకు, గీవింద్‌కు పెళ్లైనట్లు, కలిసి ఆనందంగా ఉన్నట్లు చూపించారు. విజయ్‌ థియేటర్లో రష్మిక పక్కన కూర్చుని ఇలా కల కన్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక్కసారిగా విజయ్‌ చెంప పగలగొట్టారు. విజయ్‌ ఆమెను ‘మేడం, మేడం ప్లీజ్‌ మేడం..’ అని బతిమలాడుతూ ఉన్నారు. సన్నివేశాల్ని బట్టి వీరిద్దరు అధ్యాపకులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

‘ఇంకొక్కసారి అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అని తిరిగావ్‌ అంటే యాసిడ్‌ పోసేస్తాను’ అని విజయ్‌ను రష్మిక హెచ్చరించారు. ‘ఇక మారవా నువ్వు’ అని అడిగితే.. ‘లేదు మేడం.. నేను మారిపోయా.. ఇప్పుడు నేను పూర్తిగా వేరు’ బదులిచ్చారు విజయ్‌. ఈ టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది.

Related posts

Leave a Comment