గద్దె దించడానికే బయలుదేరాం

నవతెలంగాణ నిర్మిద్దాం
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా శంఖారావం
మా ఓట్లతో గెలిచి నీ పెత్తనమేమిటి?
ప్రగతిభవన్‌ పాఠక్‌ తీయరు.. సచివాలయానికి రారు
ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ జరిపిస్తాం
వ్యవసాయమే మా పార్టీ ప్రధాన అజెండా
తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాం

నేను మాయమాటలు చెప్పను. అవి మీకు నచ్చవు. ఈ రోజు నుంచి తెలంగాణలో కొత్త రాజకీయాలు. నా దగ్గర పైసల్లేవు. పైసలు వెదజల్లినవారు.. రేపు ఏరుకోవడం లేదా? రెండ్రోజుల కూలీ డబ్బుల కోసం ప్రజలు బతుకు, భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారాన్ని దుర్వినియోగం చేసేవారిని నిలదీద్దాం. మా ఓట్లతో గెలిచి నీవేంది పెత్తనం చేసేది. దిగిపొమ్మని ఈ వేదికపై చెబుతున్నాం. దించడానికే బయలుదేరాం
తెలంగాణ కోసం కొట్లాడితే రౌడీ అవుతారా? వారిని అణచిన ఎమ్మెల్యేలు, అణచివేసిన వాళ్లు రౌడీలు కావాలి. అప్పట్లో ఉద్యమంలో దెబ్బలుతిని, ఇప్పుడు కేసుల పేరిట మళ్లీ జైలు పాలవుతున్నారు. ఉద్యమంలో పోరాడిన వారెవరూ ఎమ్మెల్యే కావాలని, మంత్రి సీటు దక్కాలని కోరుకోలేదు. యువతకు కోరుకున్న ఉద్యోగాలు, రైతులను బాగుచేయాలని, కార్మికులకు వేతనాలు పెంచాలని, ఒప్పంద ఉద్యోగుల బతుకులు మార్చాలని, ఉద్యోగులను ఆదుకోవాలని, ప్రతి తెలంగాణ వ్యక్తి ఆత్మగౌరవంతో పనిచేయాలని కోరుకున్నాం. ఇంతకన్నా ఏ ఒక్కటీ ఎక్కువ కోరలేదు

తెలంగాణలో నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడతామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రకటించారు. ప్రభుత్వం ప్రజల మీద పరాన్నభుక్కుగా జీవిస్తోందని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ప్రజలకు సేవ చేసేదిలా ఉండాలని, పీడించేది కాకూడదన్నారు. గుత్తేదారులు, కార్పొరేట్లతో స్నేహం చేస్తూ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిధుల దుర్వినియోగం లేకపోతే వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమని వెల్లడించారు. పాలకుల అవినీతి వల్లనే తెలంగాణ వెనుకబడిందన్నారు. తెలంగాణ జనసమితి ద్వారా మరో నవ తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఆదివారమిక్కడ సరూర్‌నగర్‌ మైదానంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరిగింది. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కోదండరాం అధ్యక్షోపన్యాసం చేశారు.

Related posts

Leave a Comment