గజ్వేల్ బయల్దేరిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటనకు బయల్దేరారు. మరికాసేపట్లో నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
తెలంగాణకు హరితహారం నాలుగోవిడుత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం తనసొంత నియోజకవర్గకేంద్రమైన గజ్వేల్‌లో మొక్కలు నాటనున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఒకేరోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ములుగు సమీపంలోని రాజీవ్హ్రదారిపై, ప్రజ్ఞాపూర్ చౌరస్తా, గజ్వేల్‌లోని ఇందిరాచౌక్ వద్ద సీఎం కేసీఆర్ మూడు మొక్కలు నాటుతారు. గజ్వేల్ పరిధిలోని ప్రతి ఇంటి ఆవరణలో, రహదారులకు ఇరువైపులా, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రార్ధనామందిరాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ స్థలాలలో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

బుధవారం ఉదయం అన్ని పాఠశాలలు, ప్రార్ధనామందిరాల్లో సైరన్ మోగించగానే సీఎం కేసీఆర్ ఇందిరాచౌక్ వద్ద కందంబ మొక్కను నాటుతారు. అదేసమయంలో ప్రజలందరూ మొక్కలు నాటుతారు. ఇందుకోసం వివిధ నర్సరీల నుంచి ఒకటిన్నర నుంచి రెండుమీటర్లు ఉన్న దాదాపు లక్షా 25వేల మొక్కలను సిద్ధంగా ఉంచారు. పండ్లు, పూల మొక్కలతోపాటు ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి వీలుగా చింత, మామిడి, అల్లనేరేడు, కరివేపాకు, మునగ మొక్కలను ప్రత్యేకంగా తెప్పించారు. ములుగు, గజ్వేల్ నర్సరీలతోపాటు కల్పకవనం అర్బన్‌పార్క్ నుంచి పట్టణంలోని వివిధ ప్రాంతాలకు వాటిని తరలించారు.

Related posts

Leave a Comment