కొత్తగా 9,200 మంది కార్యదర్శుల నియామకం

మూడేళ్ల ప్రొబేషన్‌, రూ.15 వేలు వేతనం 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం
* గ్రామాలను వికాస కేంద్రాలుగా, ఆదర్శగ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది.
* పాలకవర్గంతో కలసి గ్రామ కార్యదర్శి ఎన్నో బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది.
* 200 జనాభా కలిగిన పంచాయతీకి కూడా కార్యదర్శిని నియమించాలని నిర్ణయించాం. వారంతా కష్టపడి పనిచేస్తే తెలంగాణ గ్రామాలు ఆదర్శంగా వెలుగొందుతాయి.
* దేశవ్యాప్తంగా ఆదర్శ గ్రామాలు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలోనే అనే పేరు వస్తుంది
తెలంగాణలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఇక తీరనుంది. కొత్త వాటితో కలిపి రాష్ట్రంలో ఉన్న మొత్తం 12,751 పంచాయతీలకు కార్యదర్శులను నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న కార్యదర్శులకు అదనంగా.. కొత్తగా 9,200 మందిని నియమించదలచినట్లు ఆయన వెల్లడించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియను ప్రారంభించి రెండు నెలల్లోగా పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,562 మంది కార్యదర్శులు పంచాయతీల క్లస్టర్లవారీగా విధులను నిర్వహిస్తున్నారు. కొంతమంది వేరే క్లస్టర్లకు అదనంగా విధులను నిర్వహిస్తుండంతో ఒక్కొక్కరు నాలుగైదు పంచాయతీలకు పైగానే పర్యవేక్షించాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి ఆదివారం నిర్వహించిన ఒక సమావేశంలో.. ఇక ప్రతి పంచాయతీకి ఒక్కో కార్యదర్శి ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్‌ ఎస్‌కే జోషి, ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, కమిషనర్‌ నీతూ ప్రసాద్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్యదర్శులకు అదనంగా 9,200 మంది అవసరం కావటంతో వారి నియమాకాల ప్రక్రియపై అధికారులకు ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు. ‘ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి చొప్పున ఉండాలి. పల్లెలను ప్రగతి సీమలుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలి. కొత్తగా నియమితులయ్యే 9,200 మందికి మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్‌ ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్ధీకరించాలి. ప్రొబేషన్‌ సమయంలో నెలకు రూ.15,000 చొప్పున జీతం ఇవ్వాలి. నియామకాల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాలి. జిల్లా కేడర్‌లో ఎంపికలు ఉండాలి’ అని సీఎం పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యంతోపాటు, తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశంతోనే కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసినట్లు సీఎం స్పష్టంచేశారు.

Related posts

Leave a Comment