కొత్తగా బీ హబ్

తెలంగాణలో బయోటెక్నాలజీ, బయోఫార్మా రంగాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా బీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఏర్పాటుచేయనున్న బీ హబ్ ప్రాజెక్టు కోసం రూ.60 కోట్లు ఖర్చుచేయనున్నామని, బయోఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతమిచ్చేందుకు బీ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో బీహబ్‌ను ఏర్పాటుచేస్తామని, దీనిద్వారా 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశోధనశాలతోపాటు ఇంక్యుబేటర్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

బీహబ్ ఏర్పాటుతో రాష్ట్ర బయోఫార్మా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ద్వారా స్వదేశీ కంపెనీలకు బయోఫార్మా రంగంలో ముందున్న కొరియా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల స్థాయి పరిశోధన, తయారీ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతోపాటు లైఫ్‌సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని పేర్కొన్నారు. బయోఫార్మా రంగలో పరిశోధనలను కొనసాగిస్తూ ఉత్పత్తి ప్రక్రియలోకి బీహబ్ ఉపయుక్తంగా ఉంటుందని, ఫార్మా కంపెనీలకు బిజినెస్‌ప్లానింగ్, సెల్‌లైన్ డెవలప్‌మెంట్, ప్రాసెస్ డెవలప్‌మెంట్, రిస్క్ అసెస్‌మెంట్ వంటి అనేక అంశాలకు కావాల్సిన వనరులు ఇందులో అందుబాటులో ఉంటాయని మంత్రి కేటీఆర్ వివరించారు. బయోఫార్మా రంగానికి కావల్సిన నిధులను సేకరించుకునేందుకు, ఇతర అన్ని అంశాలకు బీహబ్ వేదికగా ఉంటుందని, దీనిలో స్కేల్‌అప్ ప్రయోగశాల, సెల్‌లైన్ డెవలప్‌మెంట్, క్లోన్‌సెలక్షన్, స్మాల్‌స్కేల్ ప్రొడక్షన్ అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ ప్రాసెస్ లాంటి అనేక సౌకర్యాలు, ప్రీ-క్లినికల్ అధ్యయనాలకు అవసరమయ్యే వసతులు అందుబాటులోకి వస్తాయని వివరించారు.

ఆసియా ఖండంలోనే ఎంతో వాసికెక్కిన జినోమ్‌వ్యాలీలో ఇప్పటికే 200 బయోఫార్మా కంపెనీలు కార్యకలాపాలను విస్తరించుకుంటున్నాయని తెలిపారు. కామన్ స్కేల్‌అప్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బీహబ్ ద్వారా లభిస్తాయని, ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు బీహబ్ ఎంతో అనువుగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాక్సిన్‌హబ్ ఆఫ్ ఇండియాగా పేరుగడించిందని, రానున్న పదేండ్లలో 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లోని ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్కు, లైఫ్‌సైన్సెస్ ఇన్‌ఫ్రాక్చర్ ఫండ్ లాంటి అనేక ప్రాజెక్టులకు బీహబ్ ఊతమివ్వడంతోపాటు ప్రభుత్వ లక్ష్యాలను అందుకోవడంలో ఉపయోగపడగలదని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి, లైఫ్‌సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment