కొంగరకలాన్ సభకు వెళ్తుండగా ప్రమాదం.. యువకుడి దుర్మరణం

డీసీఎంపై నుంచి పడి అబ్దుల్ జానీ మృతి
ఉస్మానియాకు మృతదేహం
ఆదుకోవాలంటున్న కార్యకర్తలు
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని మాదారానికి చెందిన సయ్యద్‌ అబ్దుల్‌జానీ(32) టీఆర్ఎస్ కార్యకర్త. ఆదివారం గ్రామం నుంచి ఓ డీసీఎం కొంగరకలాన్ సభకు బయలుదేరింది. స్థానిక కార్యకర్తలతో కలిసి జానీ కూడా అందులో బయలుదేరాడు.

డీసీఎం క్యాబిన్‌పై కూర్చున్న జానీ అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమైన జానీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. జానీ మృతితో అతడి కుటుంబం వీధిన పడిందని, అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Related posts

Leave a Comment