కేసీఆర్ కారు నంబ‌రును వాడేస్తున్నారు

వాడుకోవ‌డంలో మ‌న వాహ‌న‌దారుల‌ను మించిన వారుండ‌రు. ఏ కారు విడిభాగాలు ఏ కారుకు వాడ‌తారు ? ఏ బైకు నంబ‌రు ప్లేటు ఏ కారుకు భిగిస్తారో ? పోలీసులు ప‌ట్టుకుంటే కానీ అర్ధం కాదు. నిన్న గాక మొన్న ఏకంగా సూర్యాపేట సీఐ వాహ‌నాన్నే ఎత్తుకెళ్లిన ఘ‌నులను చూశాం. ఇప్పుడు ఏకంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వినియోగించే కారును అనేక మంది అనేక కార్ల‌కు వినియోగిస్తున్న‌ట్లు తాజాగా బ‌య‌ట‌ప‌డింది.

కేసీఆర్ కాన్వాయ్ శ్రేణిలోని వాహనాలన్నింటికీ ‘TS 09 K 6666’ అనే నంబర్ ఉంటుంది. భద్రత కోసం అలా ఒకే నంబర్ తో కూడిన ప‌లు వాహనాలను వాడుతుంటారు. కేసీఆర్ ఏ వాహ‌నంలో ఉంటారో ఎవ‌రికి తెలియ‌కుండా ఉండ‌డానికి ఈ విధంగా చేస్తారు. కేసీఆర్ కాన్వాయ్ లో రెండు టయోటా ప్రాడో, నాలుగు ఫార్చ్యూనర్ వాహనాలు ఉంటాయి. కేసీఆర్ వాహ‌న‌శ్రేణికి ఉండే ‘TS 09 K 6666స నంబ‌రును హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌లు వాహ‌నాల‌కు వాడుతున్న‌ట్లు తెలుస్తుంది.

అతి వేగం, ట్రాఫిక్ నిబంధ‌న‌ల అతిక్ర‌మ‌ణల‌కు పోలీసులు విధించిన చ‌లాన్ల‌ను పరిశీలించ‌గా ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఏకంగా ముఖ్య‌మంత్రి వాహ‌న నంబ‌రునే ఇలా వాడేస్తుండ‌డం గ‌మ‌నార్హం. బెంజ్, ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్ వాగన్ వంటి ఖరీదైన కార్లు ఈ నంబ‌రుతో తిరుగుతున్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. ఇవేవీ కేసీఆర్ కు సంబంధించిన‌వి కాక‌పోవ‌డం విశేషం.

కొంత మంది రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు త‌మ ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు ఇలా దొంగ నంబ‌రు ప్లేట్ల‌ను వినియోగిస్తుంటార‌ని పోలీసు వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మ‌ధ్య ఎక్కువమంది కేసీఆర్ సెంటిమెంట్ గా వాడే 6666 నంబ‌రును త‌మ వాహ‌నాల‌కు ఎక్కువ‌గా వినియోగించ‌డం ఈ వాద‌న‌కు బ‌లం చేకూరుస్తుంది. అయితే అస‌లు జ‌రిమానా విధించిన కార్ల‌కు ఎవ‌రి నుండి డ‌బ్బులు వ‌సూలు చేయాలి అన్న‌ది పోలీసుల‌కు త‌ల‌కుమించిన భారంగా మారింది.

Related posts

Leave a Comment