కాలుష్యమనేదే ఉండదు అమరావతికి రండి.. ఆయుష్షు పెరుగుతుంది

కాలుష్యమనేదే ఉండదు అమరావతికి రండి.. ఆయుష్షు పెరుగుతుంది
ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న నాణ్యమైన జీవన ప్రమాణాలు, వసతులు రానున్న పదేళ్లలో కచ్చితంగా అమరావతిలో కల్పిస్తామని హామీ ఇస్తున్నా. మా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించి..తయారీ, పారిశ్రామిక రంగాలకు హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చండి. ఏపీని మీ రెండో ఇల్లుగా మార్చుకోండి. మొదట ఒక పరిశ్రమ నెలకొల్పండి. నచ్చితే దాన్ని విస్తరించండి. మాపై సందేహాలుంటే సింగపూర్‌ ప్రభుత్వాన్ని అడిగి నివృత్తి చేసుకోండి.

‘‘అమరావతిని హరిత నగరంగా నిర్మిస్తున్నాం. పచ్చటి ఉద్యానవనాలు, సుందరమైన కాలువలతో అమరావతి శోభిల్లుతుంది. నూరుశాతం ఎలక్ట్రిక్‌ వాహనాలే వినియోగిస్తాం. ప్రమాణాల మేరకే కార్బన్‌ డయాక్సైడ్‌ ఉండే (సీఓ2 న్యూట్రల్‌) వాతావరణాన్ని నెలకొల్పుతున్నాం. అత్యవసర సేవలకు ఐదు నిమిషాల్లో, సామాజిక అవసరాలకు 10 నిమిషాల్లో, కార్యాలయాలకు 15 నిమిషాల్లో కాలినడకన చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాం. రాష్ట్రంలో పెట్టుబడిలేని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ… ఆరోగ్యకరమైన పంటలు ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడున్న ఎవరైనా సరే అమరావతికి వచ్చి స్థిరపడొచ్చు. అక్కడుంటే మీ ఆయుష్షు పెరుగుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు సింగపూర్‌ వెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం రెండో రోజు ‘‘పట్టణీకరణ-నీరు, పర్యావరణం, ప్రజా రవాణా నిర్వహణ’ అన్న అంశంపై జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్‌ ఉప ప్రధాని థర్మన్‌ షణ్ముగరత్నం ప్రారంభోపన్యాసం చేయగా, శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమ్‌ సింఘే కీలకోపన్యాసం చేశారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన నిపుణులతో జరిగిన ప్యానల్‌ చర్చలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పరిపాలనలో తీసుకువచ్చిన సంస్కరణలు, వినూత్న విధానాల్ని ఆయన వివరించారు. పునరుత్పాదక ఇంధన వనరులకే ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ప్రస్తుతం వనరులకు కొరత లేదని, సాంకేతికతను సమర్థంగా వాడుకుంటూ, తగిన ప్రణాళికతో ముందుకు వెళితే అద్భుతాలు సాధించగలమని ఈ చర్చలో పాల్గొన్న ప్రపంచంలోని వివిధ నగరాల మేయర్లకు ఆయన సూచించారు. సమావేశానికి హాజరైన వారు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలిచ్చారు. అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న ఘనమైన చారిత్రక వారసత్వాన్ని, ఆధునికతను మేళవించి రాజధానిని నిర్మిస్తున్నట్టు వివరించారు. చర్చలో ప్రపంచబ్యాంకు ఈసీఓ క్రిస్టెలినా జార్జియెవా తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment