కాఫర్‌ డ్యాంకు సరే

పోలవరం డ్యాం ఆకృతుల కమిటీ ఆమోదం
ఎన్‌హెచ్‌పీసీ ప్రతిపాదనలను తోసిపుచ్చిన నిపుణులు
కాఫర్‌ డ్యాం ఎత్తుపై తర్వాత నిర్ణయం
పనులు ప్రారంభించుకోవచ్చు
పోలవరం 3డి నమూనా అధ్యయనాలపైనా చర్చ
పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంను యథాతథంగా నిర్మించుకునేందుకు ఆమోదం లభించింది. ప్రధాన డ్యాంతో జత చేయకుండా 2300 మీటర్ల పొడవునా నిర్మించుకోవచ్చని డ్యాం ఆకృతుల కమిటీ తేల్చి చెప్పింది. కేంద్ర జలవిద్యుత్తు పరిశోధన కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ సమర్పించిన ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కాదని అందరితో చర్చించిన మీదట స్పష్టం చేసింది. జెట్‌ గ్రౌటింగ్‌ పనులు ప్రారంభించుకునేందుకు అనుమతించింది. కాఫర్‌ డ్యాం ఆకృతులు సమర్పించి ఆమోదం పొందవచ్చని సూచించింది. దీంతో రెండు నెలలుగా పెండింగులో ఉన్న ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అనుమతి లభించినట్లయింది. దిగువ కాఫర్‌ డ్యాంలో జెట్‌గ్రౌటింగు పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. దిల్లీలో శుక్రవారం మధ్యాహ్నం పాండ్యా నేతృత్వంలో పోలవరం డ్యాం ఆకృతుల కమిటీ భేటీ జరిగింది. ఏపీ జలవనరులశాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు తదితరులు హాజరయ్యారు.

ఎన్‌హెచ్‌పీసీ కమిటీ నివేదికపై చర్చ
ఈ కమిటీ నివేదికపై ఏమంటారు అని ఆకృతుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యా ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాంను 100 ఏళ్లకు ఒకసారి వచ్చే 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించామని, ఇప్పుడు 25 ఏళ్ల వరదకు సమంగా నిర్మించాలనడం సమంజసం కాదని, గోదావరిలో చాలా సార్లు 28 లక్షల క్యూసెక్కులకు మించి వరద వచ్చిన అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నారు. గోదావరి మధ్యలో ప్రధాన డ్యాంను, కాఫర్‌ డ్యాంతో అనుసంధానించాలని ఎన్‌హెచ్‌పీసీ చెబుతోందని, ప్రధాన నదిలో ఇలా అతకడం సరికాదని చెప్పారు. పరిమిత కాఫర్‌ డ్యాం నిర్మించుకుని ప్రధాన డ్యాం పని 4, 5 నెలల్లో పూర్తి చేసెయ్యాలనడం వాస్తవదృక్పథంతో ఆలోచిస్తే సరికాదని, ఆ పరిమిత సమయంలో ప్రధాన డ్యాం నిర్మాణానికి ఏమైనా ఇబ్బందులు ఎదురై ఆలస్యమయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. డీ వాటరింగ్‌ విషయంలోను ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. పూర్తి స్థాయిలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించుకుని, ప్రధాన డ్యాం నిర్మించుకోవడంలో అనేక వెసులుబాట్లు ఉంటాయని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ ఆకృతుల కమిటీ ఛైర్మన్‌ పాండ్యా కేంద్ర జలసంఘానికి తెలియజేశారు. వారు ఈఎన్‌సీ వాదనతో పూర్తిగా ఏకీభవించారు. పాత విధానానికే పచ్చజెండా ఊపారు. కాఫర్‌ డ్యాం ఎత్తు విషయాన్ని స్పిల్‌ వే నిర్మాణ ప్రగతి ఆధారంగా తేలుద్దామని చెప్పారు. ఎంత మేర స్పిల్‌ వే పూర్తయిందో చూసుకుని ఆ మేరకు నీటిని నిల్వ చేసేలా కాఫర్‌ డ్యాం ఎత్తు అంశాన్ని నిర్ణయిద్దామని పేర్కొన్నారు. దిల్లీ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్‌ రమణ, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చి స్టేషన్‌) నిపుణులు సయితం ఎన్‌హెచ్‌పీసీ ప్రతిపాదనలను తోసిపుచ్చారు.

3డి నమూనా అధ్యయనాలపైనా చర్చ
పోలవరం ప్రాజెక్టును పుణెలోని సీఎస్‌ఎంఆర్‌ఎస్‌లో 3డి నమూనాలో రూపొందించి వివిధ అంశాలు అధ్యయనం చేశారు. వాటి వివరాలను ఈ సమావేశంలో చర్చించారు. ఆ అధ్యయనాల ప్రకారం స్పిల్‌ ఛానల్‌ ఎంత వెడల్పు ఉందో పైలట్‌ ఛానల్‌ కూడా అంతే వెడల్పు ఉండేలా మార్పులు చేయాలని సూచించారు. ఈ అధ్యయనాలకు అనుగుణంగా పోలవరం గేట్ల ట్యునియన్‌ ఆకృతులు సమర్పించాలని సూచించారు.

Related posts

Leave a Comment