కాపులు మీకెందుకు ఓట్లేయాలి

‘కాపు రిజర్వేషన్‌పై హామీ ఇవ్వలేనన్న మీకు.. మేమెందుకు ఓటు వేయాలి’ అని వైకాపా అధ్యక్షుడు జగన్‌ను కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిలదీశారు. కాపు రిజర్వేషన్‌ అంశం రాష్ట్ర పరిధి కాదు.. కేంద్రం చేయాల్సిన పని అని జగన్‌ చెప్పడం బాధగా, వింతగా ఉందన్నారు. తుని బహిరంగ సభ రోజున, అసెంబ్లీలో కాపుల డిమాండును సమర్థించి.. ఇప్పుడు ఎందుకు యూటర్న్‌ తీసుకున్నారని ప్రశ్నించారు. కాపు ఉద్యమం పుట్టిన జిల్లాలో పాదయాత్రలు నిర్వహించి తమను అవమానించడం సరికాదని.. జగన్‌కు కాపులంటే ఎందుకంత చిన్నచూపు అని నిలదీశారు. ఆదివారం కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్‌ అంశం రాష్ట్ర పరిధిలోనిది కానప్పుడు.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు రాష్ట్ర పరిధిలోనివా.. వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. పదవీకాంక్ష కోసమే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని.. కాపులను విమర్శించి ఇతర కులాలకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదని గొంతెత్తుతున్న జగన్‌.. పాదయాత్రలో వీధి వీధికి, జిల్లా జిల్లాకు హామీలు గుప్పిస్తున్నారని.. ఈ హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర, కేంద్ర బడ్జెట్‌లే కాదు.. అమెరికా బడ్జెట్‌ కూడా సరిపోదని అన్నారు. రాజమండ్రి వంతెన వద్ద జగన్‌ పాదయాత్రకు ఎదురు వెళ్లి స్వాగతం పలకమని ఆయన అనుచరుల ద్వారా కోరారని.. ‘ఏం చేశారని.. ఏం చేస్తారని ఎర్ర తివాచీ వేసి స్వాగతం పలకాలి’.. అని ప్రశ్నించి నిరాకరించినందుకు ఉక్రోసంతో కాపులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాపులకు అండగా ఉన్నవారి కోసం పల్లకీలు మోస్తామని.. వ్యతిరేకించే వారి ఖ్యాతి పెంచడానికి తాము పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. జగన్‌ తనపై సానుభూతి చూపితే ఆనందపడిపోయి కాళ్లు పట్టుకుంటానని అనుకోవడం సరికాదని.. కాపుల ప్రయోజనమే ముఖ్యమని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. అధికారం కోసం కాపులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇస్తామని నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు మధ్య పోటీపెట్టి పాదయాత్రకు రూ.లక్షల కోట్లు ఖర్చుపెట్టిస్తున్నారని ఆరోపించారు. మావాళ్లు ఖర్చుచేస్తున్న డబ్బు అక్రమంగా సంపాదించింది కాదని.. మీరు పెట్టిన ఆశకి అప్పులు తెచ్చి ఖర్చుపెడుతున్నారని అన్నారు. జగన్‌కు పదవీ కాంక్ష ఉండొచ్చు కానీ, కాపులకు రిజర్వేషన్‌ పొందాలన్న ఆరాటం ఉండకూడదా అని ప్రశ్నించారు. పదవీ ఆరాటం వదిలేస్తే.. మేము మా ఆరాటాన్నీ వదిలేస్తామని సవాల్‌ విసిరారు. జగన్‌ మొత్తం రిజర్వేషన్‌ వ్యవస్థకు వ్యతిరేకమా..? కాపులకు రిజర్వేషన్‌ అంశానికి వ్యతిరేకమా..? స్పష్టం చేయాలన్నారు. కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులు ఇస్తామని జగన్‌ ప్రకటించింది కాపులపై ప్రేమతో కాదని.. పదవీ ఆరాటంతోనేనని ఎద్దేవా చేశారు. ఉద్యమం పుట్టిన జిల్లాలోనే తప్పుపట్టడం పద్దతి కాదని.. కోటికి పైగా జనాభా ఉన్న కాపులను కించపరచడమేనని ముద్రగడ అన్నారు.
దళితులు, గిరిజనులు, బీసీల కోటాలో వాటా అడగడంలేదని.. వారి కడుపుకొట్టే ఆలోచన లేదన్నారు. కాపుల్లో ఉన్న పేదలకు మాత్రమే న్యాయం చేయమని అడుతున్నామని ముద్రగడ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో 50 శాతం దాటి రిజర్వేషన్‌లు ఉంటే.. అక్కడలేని అడ్డంకి ఇక్కడెందుకని ప్రశ్నించారు. ఉద్యమంపై పట్టుదలకు పోవద్దని.. కాపుల ఆకలి తీర్చేందుకు శుభం పలకాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశానని గుర్తుచేశారు. చంద్రబాబు తరఫున మాట్లాడితే మీరు.. మీ తరఫున మాట్లాడితే వాళ్లు అమ్ముడయిపోయారని అంటున్నారని.. మీ కోపాలు మాపై చూపడం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు హామీ వల్లే రోడ్డుమీదికి వచ్చామని.. ఆయన్ని బాధపెట్టడానికి కాదని ముద్రగడ వ్యాఖ్యానించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణపై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఏ పార్టీవారైనా వ్యక్తిగత విమర్శలు చేయడం.. కుటుంబ విషయాలు రోడ్డుపైకి లాగడం తప్పని అన్నారు. సమావేశంలో ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ వాసిరెడ్డి ఏసుదాసు, నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్‌, నల్ల విష్ణు, గుండా వెంకటరమణ, తాతాజీ, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment