కాంగ్రెస్ ను విమర్శించారు.. మరి మీ బాధ్యత ఏమైంది?: మోదీపై చంద్రబాబు ఫైర్

80 హామీలు ఇచ్చారు… ఒక్కటి కూడా నెరవేర్చలేదు
ఏపీకి తలసరి ఆదాయం తక్కువగా ఉండటానికి ఎవరు కారణం?
తల్లిని ఇప్పటికైనా బతికించమని కోరుతున్నాం
వాజ్ పేయి హయాంలో తమకు 29 మంది ఎంపీలు ఉన్నారని… తాము ఎన్డీయేలో ఉన్నప్పటికీ ఒక్క మంత్రి పదవిని కూడా అడగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. లోక్ సభ స్పీకర్ పదవిని మాత్రమే తీసుకున్నామని… ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసమే ఆ పదవిని తీసుకున్నామని చెప్పారు. కేబినెట్ లోకి చేరడానికి తాము ఒప్పుకోలేదని తెలిపారు. కానీ, రెండు పార్టీలు ఎంతో సహకారంతో కలసి పని చేశాయని చెప్పారు. అదే నమ్మకంతో ఈసారి కూడా ఎన్డీయేలో చేరామని… తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చి ఏపీ సమస్యలను పరిష్కరించాలని కోరారని… అయితే రకరకాల కారణాలు చెబుతూ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. చిన్నిచిన్ని సమస్యలను మాత్రమే పరిష్కరించారని చెప్పారు.

తాము కేంద్ర ప్రభుత్వాన్ని ఏదీ ఆశించకుండానే, పని చేశామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లేందుకు కృషి చెప్పారు. తలసరి ఆదాయం విషయంలో దక్షిణాది రాష్ట్రాలన్నింలోకి ఏపీ వెనుకబడి ఉందని… దీనికి కారణం ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇది ఏపీ ప్రజలు తప్పిదం కాదని, ఆంధ్ర ప్రజలు ఎంతో కష్టపడే తత్వం కలవాలిగిన వారైనప్పటికీ… రాష్ట్రాన్ని విభజించడంతోనే తాము నష్టపోయామని చెప్పారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన తర్వాత ఏపీకి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అని తాను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. 80 హామీలను ఏపీకి ఇచ్చారని… ఇందులో తొలి హామీ ప్రత్యేక హోదా అని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే నిధులను ఐదేళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, పార్లమెంటు డోర్లను మూసి రాష్ట్రాన్ని విభజించారని, తల్లిని చంపేశారని చెప్పారని… తల్లిని ఇప్పటికైనా బతికించమని తాము ప్రధానిని కోరుతున్నామని చంద్రబాబు అన్నారు. వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాలను ఎలాంటి సమస్యలు లేకుండా బీజేపీ ఏర్పాటు చేసిందని చెప్పిన మోదీ… ఏపీని కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా విభజించిందని చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తమరు విమర్శించారని, ఇదే సమయంలో మీ బాధ్యతను మీరు మర్చిపోయారని మోదీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

Related posts

Leave a Comment