కలవరనుకున్న ఇద్దరు ‘చంద్రు’లు కలిశారు…

4-KCR, Naidu bless Paritala Sriram on wedding

ఎప్పుడు, ఎక్కడ, ఎలాగంటే..!

శ్రీరామ్ వివాహ వేడుకలో తారసపడ్డ చంద్రబాబు, కేసీఆర్
కేసీఆర్ కోసం అరగంట వేచి చూసిన చంద్రబాబు
మరింత ఆలస్యమవుతుందని భావించి వెళుతుంటే వచ్చిన కేసీఆర్
నిన్న అనంతపురం జిల్లా వెంకటాపురం గ్రామంలో దివంగత టీడీపీ నేత పరిటాల రవి, ప్రస్తుత ఏపీ మంత్రి సునీతల కుమారుడు శ్రీరామ్ వివాహం, జ్ఞానవేణితో జరిగిన శుభవేళ, తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబునాయుడు, కే చంద్రశేఖరరావులు హాజరై వధూవరులను ఆశీర్వదించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి పెళ్లికి వచ్చిన ఈ ఇద్దరూ కలవలేదని తొలుత వార్తలు వచ్చాయి. చంద్రబాబునాయుడు వేదిక దిగి వెళ్లిపోయిన తరువాత దాదాపు 40 నిమిషాల తరువాత కేసీఆర్ కల్యాణ మండపానికి వచ్చారు. కానీ, వీరిద్దరూ కలసి కరచాలనం చేసుకుంటున్న ఫోటోలు బయటకు వచ్చాయి. వివాహానికి వచ్చిన కేసీఆర్, చంద్రబాబులు ఒకరిని ఒకరు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు.

అంతకుముందు జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇది. శ్రీరామ్, జ్ఞానలను ఆశీర్వదించి బయటకు వెళ్లేందుకు బయలుదేరిన చంద్రబాబు, తన కాన్వాయ్ ఎక్కేశారు. అప్పుడే కేసీఆర్, వెంకటాపురానికి చేరినట్టు సమాచారం అందింది. దీంతో కేసీఆర్ ను కలవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు సుమారు అరగంట సేపు కల్యాణ మండపం పరిసరాల్లోనే వేచి చూశారు. కేసీఆర్ రావడానికి మరికాస్త సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో, తనకున్న ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా ఆయన కాన్వాయ్ కల్యాణ మండపం వేదిక ప్రధాన గేటు వద్దకు చేరుకుంది. సరిగ్గా అదే సమయంలో కేసీఆర్ కాన్వాయ్ అక్కడికి చేరింది. దీంతో తన కాన్వాయ్ ని ఆపించిన చంద్రబాబు, కేసీఆర్ ను పలకరించారు. వెంకటాపురంలోని సువిశాల వేదిక బయటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఆపై చంద్రబాబు వెళ్లిపోగా, కేసీఆర్ మండపం వద్దకు చేరుకుని నూతన దంపతులను ఆశీర్వదించారు.

Related posts

Leave a Comment