కమర్షియల్‌ చిత్రాల్లోనే కాదు..చరిత్రాత్మక సినిమాల్లోనూ ఇట్టే ఒదిగిపోతారు కాజల్‌

కమర్షియల్‌ చిత్రాల్లోనే కాదు..చరిత్రాత్మక సినిమాల్లోనూ ఇట్టే ఒదిగిపోతారు కాజల్‌ అగర్వాల్‌. అందుకు ఆమె నటించిన ‘మగధీర’ చిత్రమే నిదర్శనం. యువరాణి మిత్రవిందగా కాజల్‌ ఆ పాత్రకు చక్కగా సరిపోయారు. అయితే ఇప్పుడు ఆమె మరో చారిత్రక చిత్రంలో నటించే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

దర్శకుడు భార్గవ్‌ ఓ చారిత్రక సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఇందులో కాజల్‌ రావణాసురుడి సోదరి శూర్పణక పాత్రలో నటించనున్నట్లు ఫిలిం వర్గాలు అంటున్నాయి. రామాయణంలోని చాలా పాత్రల గురించి మనం విని ఉంటాం కానీ శూర్పణక గురించి చాలా మందికి అంతగా తెలీదని.. అందుకే ఈ సినిమాలో ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలని చిత్రబృందం భావిస్తోందట. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం కాజల్‌..‘పారిస్‌ పారిస్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘క్వీన్‌’ సినిమాకు ఇది రీమేక్‌గా రాబోతోంది. రమేశ్‌ అరవింద్‌ ఇందులో కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పాటు త్వరలో ఆమె శ్రీనివాస్‌ దర్శకత్వంలో రానున్న చిత్రంలో రవితేజకు జోడీగా నటించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Related posts

Leave a Comment