కబళిస్తున్న జీవనశైలి

తెలుగు రాష్ట్రాల్లో జీవనశైలి వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, క్యాన్సర్‌ తదితర వ్యాధులు క్రమేణా కబళిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న అసాంక్రమిక వ్యాధుల చికిత్స క్లినిక్‌లకు వచ్చే వారిలో అత్యధికులు మధుమేహులే కావడం ఆందోళన కలిగించే అంశమే. ఈ క్లినిక్‌లలో చికిత్స పొందిన మొత్తం రోగుల్లో ఏపీలో 27.56 శాతం మంది, తెలంగాణలో 9.23 శాతం మంది మధుమేహులున్నారు. అలాగే ఏపీలో 27.46 శాతం, తెలంగాణలో 6.54 శాతం మంది అధిక రక్తపోటు బాధితులున్నారు. ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం 2018’ నివేదిక ఇలాంటి ఎన్నో నివ్వెరపోయే నిజాలను బహిర్గతపరచింది. జీవనశైలి వ్యాధులను నివారించడంపై తక్షణమే దృష్టిపెట్టాల్సిన అవసరముందని హెచ్చరించింది. రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల తీవ్రతనూ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 18-30 ఏళ్ల లోపు యువతులే అత్యధికంగా ఆత్మహత్యకు పాల్పడుతుండడం విస్మయపరిచే అంశమని పేర్కొంది. ఈ క్లినిక్‌లకు వచ్చిన రోగులే ప్రాతిపదికగా జాతీయ ఆరోగ్య ముఖ చిత్రంలో వ్యాధుల చిట్టా నివేదికను విశ్లేషించామని నివేదిక తెలిపింది.

కాలంతో పాటు మార్పు సహజమే అయినా..జీవన శైలిలో వచ్చిన విపరీత మార్పుల ఫలితంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒకప్పుడు 40-50 ఏళ్లలో కనిపించే రుగ్మతలు ఇప్పుడు 20-30 ఏళ్లలోనే కనిపిస్తుండడం ఆందోళన కలిగించే అంశమే. ‘‘శారీరక శ్రమ తగ్గిపోవడం..అన్ని ఆహార పదార్థాల్లో చక్కెర వినియోగం పెరిగిపోవడం..నూనెల విచ్చలవిడి వినియోగం..ఆహారంపై నియంత్రణ కొరవడటం, మానసిక ఒత్తిడి..ఆహారం, గాలి, నీరు..ఇలా అన్నీ కాలుష్యమయవడం..వీటికి తోడు మద్యపానం, ధూమపానాలు జతచేరడం..వెరసి పల్లె, పట్నమంటూ తేడా లేకుండా ప్రజలను రోగాలు చుట్టుముడుతున్నాయి. ఫలితంగా యుక్త వయసులోనే అత్యధికులు అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటివి ఎదుర్కోవాల్సి వస్తోంది’’ అని ‘జాతీయ ఆరోగ్య ముఖచిత్రం 2018’ నివేదిక స్పష్టంచేసింది. గతేడాది సేకరించిన వ్యాధుల గణాంకాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోందని తెలిపింది. తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో అసాంక్రమిక వ్యాధుల క్లినిక్‌లలో చికిత్సలు పొందాలనే అవగాహన ఎక్కువమందిలో ఉందని, ఏపీలో 9,86,284 మంది గతేడాది చికిత్స కోసం ఈ క్లినిక్‌లకు వెళ్లగా.. తెలంగాణలో 6,38,861 మందే చికిత్స పొందారని తేల్చింది.

Related posts

Leave a Comment