కన్నడ నటుడి‌ హత్యకు కుట్ర?

ప్రముఖ కన్నడ నటుడు యశ్‌ను రెండున్నరేళ్లకు మునుపు హత్య చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారా? ఈ అంశంపై గురువారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా వదంతులు గుప్పుమన్నాయి. పలు కేసులకు సంబంధించి ప్రస్తుతం న్యాయ నిర్బంధంలో ఉన్న రవికుమార్‌ అలియాస్‌ సైకిల్‌ రవిని విచారించే సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ప్రచారం మొదలైంది. నగర నేర నియంత్రణ (సీసీబీ) విభాగం అదనపు పోలీసు కమిషనర్‌ సతీశ్‌ కుమార్‌ను నటుడు యశ్‌, నిర్మాత జయణ్ణ గురువారం కలుసుకున్నారని- హత్యకు యత్నించిన వారి వివరాలను ఆరా తీశారని జరిగిన ప్రచారాన్ని సతీశ్‌కుమార్‌ ఖండించారు. యశ్‌ హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై కొందరు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారని, త్యాగరాజనగర ఠాణా పరిధిలో రౌడీషీటరు కోదండరామ ఈ హత్యకు సూత్రధారి అని ప్రచారం జరిగింది. గతంలో రవికుమార్‌, కోదండరామ బద్ధ శత్రువులు. మూడేళ్లకు మునుపు వీరిద్దరి మధ్య ఒక రౌడీషీటరు రాజీ పంచాయితీ చేశాడు. అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగిందని సతీశ్‌కుమార్‌ చెప్పారు. ప్రస్తుతం కోదండ రామ పరారీలో ఉన్నాడు. ఈ వదంతులను సృష్టించిన వారి కోసం గాలిస్తున్నామని సీసీబీ పోలీసులు తెలిపారు. వదంతులు వచ్చిన తరువాత యశ్‌ను పలువురు నటులు ఫోన్‌ చేసి పరామర్శించారు. మరికొందరు సీనియరు నటులు ఆయనకు ధైర్యం చెప్పారు.

Related posts

Leave a Comment