ఓరియంట్ సిమెంట్ భారీ విస్తరణ

రాష్ట్రంలో ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ భారీవిస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లోని సీకే బిర్లా గ్రూపు సిమెంట్ ఫ్యాక్టరీని సుమారు రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో విస్తరించనున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ సోమవారం తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు, సీకే బిర్లా గ్రూప్ చైర్మన్ సీకే బిర్లా పాల్గొన్నారు. ఈ విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని, కేంద్రం నుంచి తుదిఅనుమతులు పొందే ప్రక్రియ వేగంగా జరుగుతున్నదని సీకే బిర్లా తెలిపారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అద్భుతమైన వాతావరణం ఉన్నదని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ వినూత్న పారిశ్రామిక విధానాల విషయంలో దేశంలోని మిగిలిన రాష్ర్టాలకంటే ఎంతో ముందున్నదని, పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ మంచిపేరు సంపాదించుకున్నదని కొనియాడారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ఉన్న పరిశ్రమలకు మరింత సహకరించేందుకు, మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు బహుముఖ వ్యూహంతో ముందుకుసాగుతున్నామన్నారు. ఇప్పటికే సిర్పూర్ పేపర్‌మిల్లును తిరిగి తెరిపించడంలో విజయం సాధించామని, ఇవాళ ఓరియంట్ సిమెంట్స్ విస్తరణకు అంగీకారం కుదరడంతో కొత్తగా దాదాపు రూ.2 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఈ ప్లాంటు విస్తరణద్వారా సుమారు 4 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 8వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. కంపెనీలో స్థానిక యువకులకే ఉద్యోగ అవకాశాలు దక్కేలా చూడాలని కోరామని, ఇందుకోసం అవసరమైతే నైపుణ్య శిక్షణ కేం ద్రాన్ని సైతం ఏర్పాటుచేస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని సీకే బిర్లా సంస్థను కోరామని, ఆ సంస్థ విస్తరణతో తెలంగాణ పట్ల పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం మరింత పెరిగి రాష్ర్టానికి మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తాయని కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

అంతకుముందు ఆయన నాలుగేండ్లుగా తెలంగాణలో జరిగిన అభివృద్ధితోపాటు రాష్ట్రంలో చేపట్టిన వివిధ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సీకే బిర్లాకు వివరించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచే ప్రాథమిక సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నామని తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలతోపాటు ప్రజలకు తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ, సాగునీటి కోసం పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, విద్యుత్ కొరతను అధిగమించి అన్ని వర్గాలకు నిరంతరం కరెంటు సరఫరాచేసే స్థాయికి చేరుకున్నామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాల వల్ల గత నాలుగేండ్లుగా రాష్ట్రంలోకి కొత్తగా అనేక పెట్టుబడులు రావడంతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలు సైతం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఎండీ మల్సూర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment