ఒకడు దొరికాడు…వెబ్‌ ఛానల్‌ ముసుగులో మోసాలు

fake web channels in hyderabad

◆ నిందితుడు రాజేశ్‌పై పీడీ చట్టం కేసు

◆ మరికొంత మందిపై నిఘా

హైదరాబాద్ : వెబ్‌ చానల్‌ ముసుగులో హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో అనేక మోసాలకు పాల్పడిన మంద రాజేశ్‌పై నగర పోలీస్‌ కమిషనర్‌ పీడీ చట్టం ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో షాయినాయత్‌గంజ్‌ సీఐ ఎం.రవీందర్‌రెడ్డి శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. సీఐ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని రామచంద్రపురానికి చెందిన మంద రాజేశ్‌(33) ఎస్‌సీఐ 24 టీవీ (వెబ్‌ చానల్‌) పేరుతో అనేక మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆయనపై ఇప్పటికే భువనగిరి, హుమాయన్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మార్కెట్‌, కూకుట్‌పల్లి, వనస్థలిపురం తదితర ఠాణాల్లో ఎనిమిదికి పైగా చీటింగ్‌ కేసులున్నాయి. పోలీస్‌ ఉన్నతాధికారులతో తనకు పరిచయం ఉందంటూ పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నట్లు విచారణలో తేలింది. శంషాబాద్‌లో గతేడాది ఓ కేసులో బేగంబజార్‌కు చెందిన బడా వ్యాపారి నుంచి రూ.లక్షల్లో దండుకొని పోలీసులకు చిక్కాడు. రాజేశ్‌ మోసాలపై డీజీపీ స్థాయిలో ఫిర్యాదులు అందడంతో అప్పటి నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విచారణ జరిపించారు. నిందితుడిని గతేడాది అక్టోబరు 25న అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన అతడు తిరిగి అదే తరహా నేరాలకు పాల్పడుతన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. ఈ క్రమంలో అతడిపై పీడీ చట్టం ప్రయోగిస్తూ సీపీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. షాయినాయత్‌గంజ్‌ సీఐ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలోని పోలీస్‌ బృందం అతడి కోసం గాలింపు చేపట్టి ఆంధ్రాలో తలదాచుకున్నట్లు గుర్తించి శుక్రవారం అదుపులోకి తీసుకొని చర్లపల్లి జైలుకు తరలించారు.

వెబ్‌ చానల్‌ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న మరికొందరిపైనా పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం.

Related posts

Leave a Comment