ఐక్యరాజ్యసమితి రిపోర్టుపై మండిపడ్డ భారత్

  • కశ్మీర్ మరణాలపై విచారణ కమిషన్ వేయనున్న ఐక్యరాజ్యసమితి
  • మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ నివేదిక
  • ఉద్దేశ పూర్వకంగానే చేస్తున్నారంటూ భారత్ మండిపాటు

కశ్మీర్ లోయ కల్లోలంగా ఉందని, జమ్ముకశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్యరాజ్యసమితి వెలువరించిన నివేదికపై భారత్ మండి పడింది. జమ్ముకశ్మీర్ పై ఉద్దేశ పూర్వకంగానే ఐక్యరాజ్యసమితి తన రిపోర్టును ప్రచురించిందని ఆరోపించింది. 2016లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భారత బలగాలు తుదముట్టించినప్పటి నుంచి కశ్మీర్ లోయలో అశాంతి నెలకొందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. కశ్మీరీల మనోభావాలను భారత్, పాకిస్థాన్ లు గౌరవించాలని సూచించింది. అంతేకాదు, 2016 నుంచి కశ్మీర్ లో చోటు చేసుకున్న మరణాలపై విచారణ జరపాలంటూ తన మానవహక్కుల విభాగం చీఫ్ జైద్ రాద్ అల్ హుస్సేన్ ను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో కశ్మీర్ లో పెద్ద సంఖ్యలో భారత బలగాల మోహరింపు, పెల్లెట్లతో కాల్పులు తదితర అంశాలపై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా జైద్ మాట్లాడుతూ, వచ్చే వారం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే… ఇప్పటి వరకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే (సిిరియా అంతర్యుద్ధంలాంటివి) ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే, ఐక్యరాజ్యసమితి రిపోర్టుపై భారత్ మండిపడింది.

Related posts

Leave a Comment