ఏపీకి 18, తెలంగాణకు 9… దేశవ్యాప్తంగా 200 కొత్త రైల్వే లైన్లు!

లోక్ సభలో నేడు వెల్లడించిన రైల్వే శాఖ
కొన్ని అనుమతుల వల్ల ప్రాజెక్టుల ఆలస్యం
చట్టపరమైన అడ్డంకులను అధిగమిస్తున్నామన్న రాజన్ గోహెన్
దేశవ్యాప్తంగా 200 కొత్త రైల్వే లైన్లను ప్రకటించనున్నట్టు ప్రభుత్వం నేడు లోక్ సభకు తెలిపింది. చాలా కొత్త రైల్వే లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సహాయమంత్రి రాజన్ గోహెన్ సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, పలు కేంద్ర మంత్రి వర్గ శాఖల నుంచి కొన్ని అనుమతులు రావాల్సి వుందని ఆయన తెలిపారు. భూ సేకరణ, అటవీ, వన్యప్రాణి, పర్యావరణ వంటి చట్టపరమైన అడ్డంకులు కొన్ని ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

కొత్త రైల్వే లైన్లలో భాగంగా అస్సాం ఈశాన్య రాష్ట్రాలకు 15, ఆంధ్రప్రదేశ్ కు 18, బీహార్ కు 34, ఛత్తీస్ గఢ్ కు 8, ఢిల్లీకి 1, గుజరాత్ కు 4, హర్యానాకు 7, హిమాచల్ ప్రదేశ్ కు 4, జమ్ము కశ్మీర్ కు 1, జార్ఖండ్ కు 14, కర్నాటకకు 16, కేరళకు 2, మధ్యప్రదేశ్ కు 8, మహారాష్ట్రకు 12, ఒడిశాకు 10, పంజాబ్ కు 6, రాజస్థాన్ కు 10, తెలంగాణకు 9, తమిళనాడుకు 8, ఉత్తర ప్రదేశ్ కు 15, ఉత్తరాఖండ్ కు 3, పశ్చిమ బెంగాల్ కు 18 నూతన లైన్లు రానున్నాయని ఆయన వెల్లడించారు.

గత ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 21 హరిత రైల్వే కారిడార్ లను ఏర్పాటు చేశామని, ఈ లైన్లలో ప్రయాణించే పలు రైళ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతకుముందు సంవత్సరంలో 7 గ్రీన్ కారిడార్ లను ఏర్పాటు చేశామని, మానవ విసర్జితాలు రైలు పట్టాలపై పడకుండా చర్యలు చేపట్టామని గోహెన్ వెల్లడించారు.

Related posts

Leave a Comment