ఎవరికీ పట్టని ప్రత్యేక రైళ్లు

ఎక్కడికక్కడ ఆగిపోతున్నా చర్యలు శూన్యం
ఆరేసి గంటలు ఆలస్యంగా ప్రయాణాలు

పండక్కి వూరెళ్లిన ప్రయాణికులు అన్యాయం అయిపోయారు. ప్రత్యేక రైళ్ల పేరిట అంతే ప్రత్యేక ఛార్జీలతో వీరబాదుడు బాదినా పండక్కి వూరెళ్తున్నాములే అని ఆనందపడిన ప్రయాణికులపై ఆలస్యం నీళ్లు చల్లారు. మీరు ఎక్కాల్సిన బండి ఆలస్యం లేండి అనే నానుడి ఉన్నా..అరగంట.. గంట కాదు..ఏకంగా ఆరేసి గంటలు జాప్యం అవ్వడంతో ప్రయాణికులు వామ్మో రైలు ప్రయాణం అని గగ్గోలు పెట్టారు. ఆఖరకు ‘హమ్‌సఫర్‌’ పేరిట భువనేశ్వర్‌ నుంచి కాచిగూడకు వచ్చే ప్రత్యేక రైలు కూడా ఆరు గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
ప్రారంభం నుంచే రైళ్లు ఆలస్యం..
భువనేశ్వర్‌ నుంచి కాచిగూడకు బయలుదేరిన ‘హమ్‌సఫర్‌’ రైలు భువనేశ్వర్‌లోనే ఆలస్యంగా ప్రారంభమైంది. ఇలా గంటన్నరలో పలాసకు రావాల్సిన రైలు మధ్యాహ్నం 3 గంటలు ఆలస్యంగా చేరుకుంది. ఆ తర్వాత విశాఖపట్టణానికి సరిగ్గా సాయంత్రం 6.55 గంటలకు రావాలి. రైలు బాగుంటుంది..అంతా ఏసీ ప్రయాణం..అందుకే ఛార్జీలు అధికమైనా టిక్కెట్లు తీసుకున్నారు. ఏమాత్రం ఆలస్యం అయినా రైలు వెళ్లిపోతుంది.. టిక్కెట్‌ డబ్బులు పోతాయి..మళ్లీ మరో రైలులో కాలు పెట్టలేమని ప్రయాణికులు గంట ముందే విశాఖపట్నం స్టేషన్‌కు వచ్చి చేరుకున్నారు. ఇక సాయంత్రం 6.55 గంటల నుంచి రైలు ఆలస్యంగా నడుస్తోందనే సమాచారాన్ని స్టేషన్‌ సిబ్బంది వూదర కొట్టడం ప్రారంభించారు. ఇలా గంటగంటకూ రైలు అలస్యం సమయం మారిపోతుంది కాని.. రైలు రావడంలేదు. దీని తర్వాత రాత్రి 8.30 గంటలకు గరీబ్‌రథ్‌, తర్వాత 10 గంటలకు ఫలక్‌నుమా, ఆ తర్వాత 11 గంటలకు కోణార్క్‌ ఇలా రైళ్లన్నీ వచ్చి వెళ్తున్నాయి కాని..‘హమ్‌సఫర్‌’ రైలు మాత్రం రావడంలేదు.
సమయపాలన పట్టని అధికారులు
పండగలు, వేసవి సెలవులు, సంబరాలు పేరిట ప్రత్యేక రైళ్లను అయితే రైల్వే నడుపుతోంది కాని.. వాటిని సమయానికి పంపాలనే ఆలోచన మాత్రం చేయడంలేదు. పండగ ప్రత్యేక రైళ్లన్నీ ఇలాగే గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఆఖరకు కాకినాడ 9 గంటల ప్రయాణం 14 గంటల పాటు సాగిందని ప్రయాణికులు సంక్రాంతికి ముందు నుంచి ఫిర్యాదులు చేశారు. ఇక భువనేశ్వర్‌ నుంచి నగరానికి వచ్చే రైళ్లు 24 గంటలు కాదు.. రోజున్నర పాటు ప్రయాణించి ప్రయాణికుల సహనానికి పరీక్షలు పెట్టాయి. ప్రతి రోజు నడిచే రైళ్లను ముందు వదిలేసి..ప్లాట్‌ఫారాలు ఖాళీ లేవని ప్రత్యేక రైళ్లను గంటలకొద్దీ స్టేషన్ల బయట.. నిలిపేస్తున్నారు. స్టేషన్లలో ఆపినా..తినేందుకు తిండి అయినా దొరుకుతుంది..అలాంటిది బయట ఆపేయడంతో ప్రయాణికులు తాగు నీటి నుంచి ఆహారం వరకూ అనేక అవస్థలు పడాల్సి వచ్చింది.

స్టేషన్‌ బయటే ఆపేస్తున్నారు..
విశాఖలో స్టేషన్‌ బయట ప్లాట్‌ఫారం ఖాళీ లేదని గంటన్నరకు పైగా ఆపేశారు. కనీసం రైలులో కూర్చుందామనుకున్న ప్రయాణికుల ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఆఖరకు రాత్రి 10 గంటలకు విశాఖకు చేరుకుంది. 3 గంటల ఎదురుచూపులు తర్వాత హమ్మయ్య అని కూర్చున్నారు. ఇక అంతే మరో రెండు గంటలు స్టేషన్లోనే ఆపేశారు. ట్రాక్‌లు ఖాళీలేవు.. ఇంటర్‌లాకింగ్‌ సిగ్నల్‌ ఇవ్వడంలేదని ఇలా ఆపేసిన రైలు ఎప్పుడు బయలుదేరిందో కొంతమంది నిద్రకు ఉపక్రమించిన ప్రయాణికులకు తెలియదు. తెల్లవారి చూసే సరికి విజయవాడ కూడా దాటకపోయేసరికి గుండెలు గుబేలుమన్నాయి. విజయవాడకు వేకువజాము 3 గంటలకు రావాల్సి ఉండగా..7 గంటలకు వచ్చింది. ఇలా కాచిగూడకు 8.30కి రావాల్సి ఉన్నా.. మధ్యాహ్నం 1.45కి చేరుకుంది. ఇలా మొత్తమ్మీద ‘హమ్‌సఫర్‌’ రైలు ఆరు గంటలు ఆలస్యంగా నడిచింది. వారానికోసారి ఉండే ఈ ప్రత్యేక రైలు.. ఎక్కడ కాస్త ఆలస్యం అయినా.. చివరికి ఆ ఆలస్యాన్ని అధిగమించి సమయానికి తీసుకు వస్తుందనే పేరు ఈ పండగ రద్దీలో పటాపంచలైంది.

అంతంతమాత్రమే..
పండగ ప్రత్యేకమంటూ..చాంతాడంత జాబితా చెప్పి వందకు పైగా రైళ్లను నడుపుతున్నామని ద.మ. రైల్వే ప్రకటించినా..సరిగ్గా పండగ ముందు.. తర్వాత మూడు రోజుల పాటు నడిపిన రైళ్లు కేవలం 20 నుంచి 30 వరకే ఉంటాయి. వీటిని కూడా సరైన సమయానికి నడపకపోవడాన్ని ప్రయాణికులు తప్పుపడుతున్నారు. ఉత్తరాంధ్రకు పండగ ముందు మూడు రోజులపాటు నడిపిన రైళ్లు కేవలం అయిదు మాత్రమే. అటు నుంచి కూడా కేవలం అయిదు రైళ్లు కంటే ఎక్కువ ఉండవు. కాకినాడ, మచిలీపట్నం, విజయవాడ ఇలా ఈ మార్గాల్లోనే ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపారు. ఇలా దూరప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక రైళ్లనైనా సమయానికి నడిపితే బాగుంటుందని రైల్వే ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

Leave a Comment