ఎల్‌కేజీ చదువుకీ… రుణం కావాలా

అర్జంటుగా పదివేల రూపాయాలు అప్పుకావాలి… ఇంత చిన్న మొత్తంలో అప్పుకోసం బ్యాంకులు చుట్టూ ఎన్నిరోజులు తిరగాలో! ఒకవేళ తిరిగినా బంగారమో, మరొకటో తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇస్తారా… అదీ అనుకున్న సమయానికి! నెలకి పాతికవేల రూపాయల జీతం… ప్రతినెలా ఖర్చులు పోగా కొంత పొదుపు చేసి ఓ ఇరవై వేల రూపాయలు దాచుకోగలిగా. ఈ మొత్తాన్ని తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వచ్చే చోట పెట్టుబడిగా పెట్టాలనుకుంటున్నా. అలాంటి సురక్షిత పొదుపు మార్గాలేమైనా ఉంటాయా!
పై రెండూ వేర్వేరు సమస్యలు కావొచ్చు. మొదటిది ఓ సమస్య అయితే, రెండోది ఆర్థిక ప్రణాళిక. ఈ రెండు ఉదాహరణలు మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అదే తమ వ్యాపార సూత్రం అంటారు ‘ఎనీ టైమ్‌ లోన్‌’ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నేహా జైన్‌.

వ్యక్తిగత అనుభవాలే అనేక సమస్యలకు పరిష్కారాల్ని చూపిస్తుంటాయి. మా ‘ఎనీ టైమ్‌ లోన్‌’ ఆలోచన కూడా అలా వచ్చింది. నేను పుట్టి పెరిగిందంతా జార్ఖండ్‌లో. వృత్తిరీత్యా చార్టెడ్‌ అకౌంటెట్‌ని. మా వారు కీర్తికుమార్‌ జైన్‌ది హైదరాబాద్‌. ఆయన ఐఐటీలో చదువుకున్నారు. కొన్నాళ్లు బ్యాంకింగ్‌ రంగంలోనూ పనిచేశారు. మాకూ డబ్బు విలువా, ఆ ఇబ్బందులు తెలుసు. మా ఇద్దరిదీ మధ్యతరగతి కుటుంబ నేపథ్యమే. విద్యారుణాలతోనే ఉన్నత చదువులు పూర్తిచేశాం. అప్పుడే మొదటిసారి డబ్బు కష్టాలు తెలిశాయి. రుణం తీసుకోవడానికి సవాలక్ష ఆధారాలు చూపించాల్సి వచ్చింది. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ తరువాతే మాకు రుణాలు వచ్చాయి. మా సమస్య అక్కడితో తీరిపోలేదు. ఆ రుణాన్ని చెల్లించే క్రమంలో, రీషెడ్యూల్‌ చేయించుకోవడానికీ, చెల్లించడంలోనూ సమస్యలే. పెళ్లయ్యాక మా ఇద్దరి మధ్యా ఈ విషయం తరచూ చర్చకు వచ్చేది. అయితే ఇది మా ఒక్కరి సమస్యే కాదు… చాలా మధ్యతరగతి కుటుంబాలదని అర్థమయ్యింది. ముఖ్యంగా డబ్బు సర్దుబాట్లూ, చేబదుళ్లూ సర్వసాధారణం. పిల్లాడి చదువూ, అమ్మాయి పెళ్లీ, ఆసుపత్రి అవసరాలూ, ఇంటి సమస్యలూ…ఇలా ఒకటేమిటి? అన్నింటికీ అవే ఆధారం. కానీ బ్యాంకులు పెద్ద అవసరాలకే కానీ చిన్న మొత్తాలతో స్వల్పకాలానికి సాయం అందించలేవేమో అనిపించింది. అందుకే ఎల్‌కేజీ నుంచి పీజీవరకూ, వెయ్యిరూపాయల నుంచి యాభైవేల వరకూ స్వల్పకాలిక రుణాలను అందించే ఉద్దేశంతో ‘ఎనీ టైమ్‌ లోన్‌’ పేరుతో 2014లో ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం.
హెచ్చరించినా మొదలుపెట్టాం…
సంస్థనైతే ప్రారంభించాం కానీ ఆ లావాదేవీలు అంత సులువేం కాదని చాలా తక్కువ సమయంలోనే తెలుసుకున్నాం. బ్యాంకింగ్‌ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా రుణాలు అందించడం, వాటిని మళ్లీ వసూలు చేసుకోవడం సవాలే. రుణం ఎవరికి ఇవ్వాలనే స్పష్టత మాకు ఉన్నా మాదైన పరిశోధన చేశాం. మా దగ్గరున్న డబ్బు మొత్తం ఓ పదిమందికి వాళ్ల అవసరాలకు తగినట్లుగా ఇచ్చేస్తే… పదకొండో వ్యక్తికి ఇవ్వలేని పరిస్థితి. అందుకే డబ్బు రుణంగా ఇస్తూ దాన్నో పెట్టుబడిగా పెట్టాలనుకునేవారికీ మా వేదికద్వారా అవకాశం ఇవ్వాలనుకున్నాం. మాకు పూర్తిగా అవగాహన వచ్చాకే ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. మరి పెట్టుబడో అంటారా… విడతలవారీగా సుమారు వందకోట్ల రూపాయల్ని ఇప్పటివరకూ పెట్టుబడిగా పెట్టాం. గతేడాది టర్నోవర్‌ సుమారు అరవై మూడు కోట్ల రూపాయలు.
చదువుకునేందుకూ…
మా సేవలన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే అందిస్తాం. వెయ్యి రూపాయల నుంచీ యాభైవేలవరకూ వ్యక్తిగత రుణాల్ని ఇస్తాం. దానికి వడ్డీ కూడా తీసుకుంటాం. మరికొంత కాలం కొనసాగించాలనుకుంటే సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. ఒకసారి మా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుని, మా వెరిఫికేషన్‌ పూర్తయితే చాలు. ఎన్నిసార్లయినా రుణం తీసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా ఉచితమే. వ్యక్తిగతం కాకుండా ఇల్లూ, ఇతర రుణాలు కూడా ఇస్తాం. సాధారణంగా బ్యాంకులు ఆధార్‌, పాన్‌కార్డు… వంటివి పరిశీలిస్తాయి. మేం వాటిని పరిశీలించడంతోపాటూ ఐదు పద్ధతుల్లో వెరిఫికేషన్‌ పూర్తిచేస్తాం. దీనికోసం మాకంటూ ప్రత్యేక టెక్నాలజీ ఉంది.
అప్పూ ఇవ్వొచ్చు…
చేతిలో కొంత డబ్బు ఉండి దాని ద్వారా ఆదాయం పొందాలనుకుంటారు కొందరు. అలాంటివారు మా సంస్థ ద్వారా ఇతరులకు వడ్డీకి ఇవ్వొచ్చు. ఇలా పెట్టుబడిగా పెట్టాలనుకున్న మొత్తం వెయ్యి నుంచి లక్షరూపాయల వరకూ అయి ఉండొచ్చు. అలాని రుణం తీసుకునే వ్యక్తీ, ఇచ్చే వ్యక్తికి తెలిసుండాల్సిన అవసరం లేదు. పరిశీలన అంతా మాదే. రుణగ్రహీతకూ, రుణదాతకు వేర్వేరు ఖాతాలు ఉంటాయి. ఆన్‌లైన్‌లోనే అప్పు ఇచ్చుకోవడం, తిరిగి తీసుకోవడం జరిగిపోతుంది. అందుకోసం ముందుగా మా దగ్గర పేర్లు నమోదు చేయించుకోవాలి. పెట్టుబడి పెట్టినవారు నాలుగు శాతం ఆదాయం అందుకోవచ్చు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా సుమారు 120 మంది రుణదాతలు ఉన్నారు. తీసుకోవడంతో పోలిస్తే… డబ్బును రుణంగా అదీ తెలియని వారికి ఇవ్వాలనుకునేవారు కాస్త ఆలోచించడం సహజం. దీనికీ మా దగ్గర సమాధానం ఉంది. ఒక వ్యక్తి మా దగ్గర లక్షరూపాయలు పెట్టుబడి పెట్టాలనుకున్నాడు. మరో వ్యక్తికి అదే లక్ష రూపాయలు అవసరం అయ్యాయనుకోండి. పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం ఆ వ్యక్తికి ఇవ్వడం జరగదు. పదిమంది పెట్టుబడిదారుల నుంచి పదివేల చొప్పున తీసుకుని అప్పు ఇస్తాం. ఇప్పటివరకూ జరగలేదు కానీ… ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వలేకపోయినా పెట్టుబడి పెట్టినవారికి పోయేది ఏమీ ఉండదు. మిగిలిన తొంభైవేల రూపాయల నుంచీ ఆ వడ్డీ భర్తీ అవుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరంలేదు. చెప్పాలంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ పద్ధతిలోనే మేమూ పనిచేస్తున్నాం.
ఇబ్బందులు సహజమే…
వ్యాపారం అన్నాక ఇబ్బందులు ఎందుకుండవు. పైగా డబ్బుతో లావాదేవీలు. అందుకే వీటన్నింటి విషయంలోనూ పక్కాగా ఉంటాం. రుణదాతలతో పెద్దగా పేచీలు లేకపోయినా రుణగ్రహీతలు చెల్లింపుల విషయంలో వాయిదాలూ, వాదనలూ ఉండనే ఉంటాయి. ఇవన్నీ మా 24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్‌, రికవరీ డిపార్ట్‌మెంట్‌ల సాయంతో పరిష్కరించుకుంటాం. కొన్నిసార్లు చెల్లించే మొత్తాల విషయాల్లోనూ రాజీపడాల్సి వస్తుంది. ఈ మొత్తం వల్ల మీకు ప్రయోజనం ఏంటీ¨ అంటే తీసుకున్న మొత్తానికి నాలుగు వందల రూపాయలు వడ్డీగా చెల్లిస్తే దానిలో తొంభైశాతం అప్పిచ్చినవారు తీసుకుంటే పదిశాతం మొత్తం కంపెనీకి వస్తుంది.

Related posts

Leave a Comment