ఎట్టాగయ్యా శివ శివ…

‘‘నాకు గురువు శ్రీరామ్‌. ఆయన నాకు ఇంగ్లిష్‌ అధ్యాపకులే కాదు…ఆధ్యాత్మిక గురువు కూడా. వాళ్ల బ్బాయి ఉదయ్‌శంకర్‌ని నా ‘గోకులంలో సీత’ నుంచి చూస్తున్నా. ఈ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. అందరు కథా నాయకుల్లా కాకుండా..ఒక మంచి పాత్రతో తనని తాను నటుడిగా నిరూపించుకొనే ప్రయత్నం చేయడం నాకు బాగా నచ్చింది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌. ‘ఆటగదరా శివ’ చిత్రంలోని ‘ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే…’ అంటూ సాగే గీతాన్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు పవన్‌. చైతన్య ప్రసాద్‌ రచించిన గీతమిది. వాసుకి వైభవ్‌ స్వరకర్త. చంద్ర సిద్ధార్థ్‌ దర్శకత్వంలో, ఉదయ్‌శంకర్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మించారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పాట విడుదల అనంతరం పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘కథానాయకుడు ఉదయ్‌ తన చిన్నప్పట్నుంచి నాకు తెలుసు. ఒక మంచి పాత్రలో నటించాడు. ఉరిశిక్ష పడ్డ ఖైదీ జీవితానికి సంబంధించిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు చంద్రసిద్ధార్థ్‌.

ఆయన దర్శకత్వం వహించిన ‘ఆనలుగురు’తో పాటు, ఇతర చిత్రాలు అందరికీ నచ్చేలా ఉంటాయి. ఈ సినిమాలోని సన్నివేశాలు కొత్తగా అనిపించాయి. చైతన్యప్రసాద్‌ సాహిత్యం నాకు నచ్చింది. వాసుకి వైభవ్‌ రాసిన శివతత్వం పాట బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా’’ అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘నేను పవన్‌కల్యాణ్‌కి పెద్ద అభిమానిని. నేను కథానాయకుడిగా నటించిన తొలి సినిమాలోని పాటని ఆయన విడుదల చేయడం ఆనందంగా ఉంది. చంద్రసిద్ధార్థ్‌ ఒక మంచి అనుభూతికి గురిచేసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కన్నడ అగ్ర నటుడు దొడ్డన్న నాతో కలిసి ఈ చిత్రంలో నటించార’’న్నారు. గీత రచయిత చైతన్య ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘నేను రాసిన ‘ఎట్టాగయ్యా శివ శివ’ పాటని పవన్‌కల్యాణ్‌ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఉరిశిక్షను తప్పించుకొన్న ఖైదీ… ఉరి తీయడానికి వస్తున్న తలారి జీపులో ఎక్కుతాడు. ఒకరి గురించి మరొకరికి తెలియని ఆ ఇద్దరి ప్రయాణం ఎక్కడిదాకా సాగిందనే విషయాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు.

Related posts

Leave a Comment