ఎక్కడున్నానన్న విషయాన్ని ఇంకా వెల్లడించని కత్తి మహేష్!

  • ఆదివారం రాత్రి నోటీసులు అందించిన పోలీసులు
  • ఆ వెంటనే హైదరాబాద్ వీడిపోయిన కత్తి
  • పీలేరు ప్రాంతంలో ఉన్నట్టు అంచనా
  • ఇంకా స్పందించని కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పై హిందూ సంఘాల తీవ్ర వ్యతిరేకత, ఆయనపై నగర బహిష్కరణ వేటు పడేలా చేసింది. గత రాత్రి కత్తి మహేష్ ను కలిసిన పోలీసులు, ఆయనకు నగర బహిష్కరణ నిర్ణయాన్ని తెలిపి, డీజీపీ మహీందర్ రెడ్డి ఆదేశాలతో ఉన్న నోటీసులను ఇచ్చి, తక్షణమే నగరం విడిచి పోవాలని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఆయన్ను తెలంగాణ సరిహద్దుల వరకూ తోడుండి తీసుకెళ్లిన పోలీసులు, అక్కడ వదిలేసి వెనుదిరిగారు.

అక్కడి నుంచి కర్నూలు, కడప, ఆపై చిత్తూరు పోలీసులు ఆయన్ను పీలేరు ప్రాంతానికి చేర్చినట్టు తెలుస్తోంది. పొద్దుటి నుంచి కత్తి మహేష్ ను సంప్రదించాలని పలు టీవీ చానళ్ల ప్రతినిధులు తమవంతు ప్రయత్నాలు చేసినా, ఆయన అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని ఇంతవరకూ కత్తి మహేష్ వెల్లడించక పోవడం గమనార్హం.

కాగా, కత్తి వ్యాఖ్యలకు నిరసనగా పాదయాత్ర తలపెట్టిన పరిపూర్ణానంద స్వామిని మధ్యాహ్నం తరువాత గృహ నిర్బంధం నుంచి విడుదల చేస్తామని, పాదయాత్రకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ఆయనకు సూచించామని రాచకొండ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Related posts

Leave a Comment