ఉక్కుపై కాలయాపన కేంద్రం అడిగినవన్నీ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధం

ప్రైవేటు భూమి అధిక ధరకు కొని తక్కువకే అందజేస్తామని స్పష్టీకరణ
అయినా స్పష్టత ఇవ్వని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌
వరుసగా రెండోరోజూ అదే వైఖరి

కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కాలయాపనకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు గురువారం తెలుగుదేశం ఎంపీల బృందం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ను కలిసి కేంద్రం అడిగినవన్నీ ఇవ్వడానికి ఏపీ సిద్ధంగా ఉందని చెప్పినా అటువైపు నుంచి సానుకూలత కనిపించలేదు. మీరు చెప్పేవేవో మెకాన్‌ సంస్థకు లిఖితపూర్వకంగా చెప్పుకోవాలని కేంద్ర మంత్రి వారికి సూచించారు. మెకాన్‌ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా టాస్క్‌ఫోర్స్‌ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకూ దీనిపై తాను ఏమీ చెప్పలేనని స్పష్టం చేశారు. ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్‌ ఆరోగ్యం విషమిస్తున్నందున దీనిపై ప్రస్తుతం ప్రకటన చేసి దీక్ష విరమింపజేయాలని ఎంపీలు చేసిన విజ్ఞప్తిపై బీరేంద్రసింగ్‌ పెద్దగా స్పందించలేదు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌ కసరత్తు చేస్తున్నందున అంతా మంచే జరుగుతుందని భావించి దీక్ష విరమించాలని మాత్రమే సీఎం రమేష్‌కు సూచించారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశాన్ని చెప్పారు. తెలుగుదేశం ఎంపీలు బుధవారం కేంద్ర మంత్రిని కలిసి విన్నవించినప్పుడు భూమి, ఖనిజ అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వ సమాచారం కోరామని, అది అందిన వెంటనే కార్యాచరణ చేపడతామని హామీనిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీలు బుధవారమే అమరావతిలోని ఏపీఎండీసీ ఎండీ వెంకయ్యచౌదరితో మాట్లాడగా కేంద్రం అడిగిన సమాచారం తాము 22వ తేదీనే పంపించామని చెప్పారు. ఎంపీలు ఆయన్ను గురువారం దిల్లీకి పిలిపించి సమాచార మార్పిడికి సంబంధించిన వివరాలన్నింటినీ కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌, ఉక్కుశాఖ కార్యదర్శి అరుణాశర్మలకు కూలంకషంగా వివరించారు. ఉక్కు పరిశ్రమ కోసం రాష్ట్రం నాలుగు వేల ఎకరాలు కేటాయించిందని, అకస్మాత్తుగా ఈనెల 15న 1800 ఎకరాలు ఇస్తే చాలని మెకాన్‌ వర్తమానం పంపిందని ఎంపీ దివాకర్‌రెడ్డి కేంద్ర మంత్రికి చెప్పారు. ఆ భూమి ఇవ్వడానికి తాము సిద్ధమేనని మెకాన్‌కు ఏపీఎండీసీ కూడా వర్తమానం పంపిందని వివరించారు. మెకాన్‌ కొత్తగా మార్కింగ్‌ చేసిన భూమిలో లోగడ రాష్ట్రం కేటాయించిన నాలుగు వేల ఎకరాల్లోని 1300 ఎకరాలకు అనుబంధంగా మరో 500 ఎకరాల ప్రైవేటు భూమి ఉందని చెప్పారు. ఈ 500 ఎకరాల గురించి ఈనెల 15న పంపిన లేఖలో కొత్తగా చెప్పారని వివరించారు. తాము ప్రైవేటు భూమిని అధిక ధరకు కొన్నా కేంద్రానికి ప్రభుత్వ భూమి తరహాలోనే ఎకరాకు రూ.నాలుగు లక్షలకే ఇస్తామని తెలిపారు. 24 గంటల్లో ఈ సమాచారం మెకాన్‌కు పంపుతామని, వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఎంపీలు ముక్తకంఠంతో కేంద్ర మంత్రిని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ.. మెకాన్‌ కోరిన వివరణలన్నింటికీ ఏపీ ప్రభుత్వం సమాధానం పంపినట్లు ఎంపీలు తన దృష్టికి తెచ్చారని అన్నారు. ఆ సమాధానాల ఆధారంగా మెకాన్‌ తుది నివేదికను తయారుచేసి టాస్క్‌ఫోర్స్‌ సమావేశం ముందు పెడుతుందని తెలిపారు. వారి సిఫారసుల ఆధారంగా ప్లాంటు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. ఈ ప్రక్రియ తుది అంకానికి చేరుకున్నదని అన్నారు. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటై ఏడాదిన్నరే అయిందని, నాలుగేళ్లుగా దీనిపై జాప్యం చేస్తున్నామనడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ హామీ విభజన చట్టంలో ఉందని, దీని అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరమవుతుందని పేర్కొన్నారు. సమస్యకు ఉత్తమ పరిష్కారం లభించాలని కోరుకుంటున్నానన్నారు.

బయ్యారంతో ముడిపెడుతున్న కేంద్ర మంత్రి
విభజన చట్టంలో కడపతో పాటు తెలంగాణలోని బయ్యారం పరిశ్రమ ఏర్పాటు అంశం ఉన్నందున ఒకేసారి వీటిపై ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్‌ తెదేపా ఎంపీలతో సమావేశం, అనంతరం విలేకర్లతో ఇష్టాగోష్ఠిలోనూ వ్యాఖ్యానించారు. టాస్క్‌ఫోర్సు ఈ రెండింటి కోసమూ ఏర్పాటుచేశామని, ఇప్పటివరకూ మెకాన్‌ ప్రశ్నలకు ఏపీ 95శాతం సమాధానాలిస్తే, తెలంగాణ 15శాతమే ఇచ్చిందని అన్నారు. మిగిలిన సమాధానాలివ్వాలని తెలంగాణకు తాము సూచించామన్నారు. రెండు కర్మాగారాలను వేర్వేరుగా చూస్తామని ఒకసారి, ఒకేసారి ముందుకెళ్తామని మరోసారి సమాధానమిచ్చారు. ఒక రాష్ట్రానికి ప్లాంటు ప్రకటించి మరో రాష్ట్రానికి ప్రకటించకపోతే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయేమోనన్న ఉద్దేశంతో కేంద్రం రెండింటిపై ఒకే విధానంతో వెళ్లాలని యోచిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

రైల్వేలైన్‌ ఖర్చూ భరిస్తామన్నాం: జేసీ
కడప ఉక్కు పరిశ్రమ కోసం అవసరమైన 16 కిలోమీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణ వ్యయాన్నీ తామే భరిస్తామని కేంద్ర మంత్రికి స్పష్టం చేసినట్లు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వెల్లడించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ‘500 ఎకరాల ప్రైవేటు భూమి కావాలని దుర్బుద్ధితో అడిగారు. ప్రాజెక్టు జాప్యం చేయడంతోపాటు, నెపాన్ని రాష్ట్రంపైకి నెట్టాలనే కొర్రీలు వేయించారు. కేంద్రం కుట్రలను అడ్డుకోడానికి ప్రైవేటు భూమినీ కొనిస్తామన్నాం. మంత్రి కోరిన వివరణలన్నీ శుక్రవారానికల్లా ప్రత్యేక దూత ద్వారా పంపుతాం. అయిదో తేదీలోపు మళ్లీ వచ్చి మంత్రిని కలుస్తాం’ అని అన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు నిమ్మల కిష్టప్ప, గల్లా జయదేవ్‌, కె.రామ్మోహన్‌నాయుడు, బుట్టా రేణుక, శ్రీరాంమాల్యాద్రి, పండుల రవీంద్రబాబు, మాగంటి బాబు, గరికపాటి మోహన్‌రావు, కనకమేడల రవీంద్రకుమార్‌ ఉన్నారు.

Related posts

Leave a Comment