ఈ కుంభకోణంలో పీఎన్‌బీకి దక్కే బీమా రెండు కోట్లేనట!

PNB Scam accused Nirav Modi left the country before CBI received complaint from the bank

తక్కువ బీమా కవర్ తీసుకున్న పీఎన్బీ
ఇందులో మొత్తం స్కాం విలువ కవర్ కాదు
ఇతర బ్యాంకులకు ఆయా మొత్తాలను పీఎన్బీనే చెల్లించాలని ఆర్బీఐ ఆదేశం
జరిగింది వేల కోట్ల స్కాం.. అయితే బీమా ద్వారా వచ్చేది మాత్రం కేవలం రెండు కోట్లట! అవును, బ్యాంకింగ్ రంగంలోనే పెను సంచలనం రేపిన దాదాపు రూ.11,300 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ‘ఉద్యోగుల మోసం’ ద్వారా ఏదైనా కుంభకోణం జరిగితే వచ్చే మొత్తానికి తీసుకున్న బీమా కవర్ మాత్రం చాలా తక్కువగా ఉందని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇది బ్యాంకు పరిస్థితిని మరింత దెబ్బతీసే విధంగా ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతానికి సుమారు రూ.2 కోట్ల వరకు మాత్రమే నష్టపరిహార బీమా పాలసీని పీఎన్‌బీ కొనుగోలు చేసింది. ఇది వెలుగుచూసిన కోట్లాది రూపాయల మోసంలో 0.70 శాతం మాత్రమే కావడం గమనార్హం.

ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు బీమా పాలసీ కింద వాణిజ్య, బిల్ డిస్కౌంటింగ్, సైబర్ బీమా కోసం ప్రత్యేకంగా ఈ సదుపాయాన్ని తీసుకున్నాయి. కానీ పీఎన్‌బీ మాత్రం అలా చేయలేదు. కొంతమంది ఖాతాదారులకు లబ్ధి చేకూర్చే దిశగా తమ సిబ్బంది తప్పుడు లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ (ఎల్‌ఓయూ)ల ద్వారా కుట్ర పన్నినట్లు పీఎన్‌బీ చెప్పింది. ఈ కేసులో నిందితులు ఈ ఎల్‌ఓయూలను చూపించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ తదితర 30 బ్యాంకుల నుంచి రుణాలు పొందినట్లు తెలిపింది.

కాగా, పీఎన్‌బీ మధ్యవర్తిగా ఉండి ఇప్పించిన బ్యాంకులన్నింటికీ అంత మొత్తాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకే చెల్లించాలని రిజర్వు బ్యాంకు ఆదేశించినట్లు తెలుస్తోంది. బ్యాంకర్ల నష్టపరిహార పాలసీ కింద పీఎన్‌బీ దాదాపు రూ.5 కోట్ల ప్రీమియంను చెల్లిస్తోందని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ఈ పాలసీ కింద స్కాం విలువ మొత్తం రాదనీ, ఆస్తి నష్టం, అగ్నిప్రమాదం, దోపిడీ, మోసాల కింద నిర్దిష్ట పరిమితులు మాత్రమే ఈ పాలసీ పరిధిలోకి వస్తాయని ఆయన చెప్పారు, ఆ విధంగా చూసుకుంటే ఈ మోసం వ్యవహారంలో కేవలం రెండు కోట్లు మాత్రమే అందుతుందని ఆయన చెప్పారు.

Related posts

Leave a Comment